రాష్ట్రవిభజన ఎవరికి ఎంత మేలు చేసిందో కానీ.. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో మాత్రం అంతులేని చీకట్లు మిగులుస్తోంది. అందులోనూ వారు రెండు రాష్టాలకు వెలుగులు నింపే.. విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఇంజినీర్లు. వీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో నియమితులయ్యారు. కానీ వాస్తవానికి వీరు ఆంధ్రా ప్రాంతానికి చెందినవారు. పని చేయడం కూడా ఏపీలోని ప్రాజెక్టుల్లోనే పని చేస్తున్నారు. రాష్టవిభజనతో వీరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.  తెలంగాణ జోన్లలో నియమితులయ్యారు కాబట్టి వీరు తెలంగాణ ఉద్యోగులంటూ ఏపీ వీరిని పట్టించుకోవడం మానేసింది. వీరు.. ఏపీ ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు కాబట్టి.. తమకు సంబంధం లేదని తెలంగాణ వదిలేసింది. ఇప్పుడు వారు అటు ఏపీకి, ఇటు తెలంగాణకు చెందనివారుగా మారారు. గత మూడు నెలలుగా వీరికి జీతాలు కూడా అందడం లేదట. తమ గోడు వినమని వీరు రెండు రాష్ట్రాల విద్యుత్ కార్యాలయాల ముందు ధర్నాలు చేసినా ఫలితం లేకపోయింది. మొత్తం 300 మందికి పైగా ఉన్నవీరి గోడు ఇప్పుడు పట్టించుకునేవారే కరవయ్యారు.  ఉద్యోగాల కోసం ఉద్యమబాట పట్టిన ఈ ఇంజినీర్లు.. సోమవారం వైఎస్సార్ సీపీ నేత జగన్మోహన్ రెడ్డిని కలిసి.. తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ ఇంజనీర్ల సమస్యను పరిష్కరించాల్సిందిగా ఏపీ, తెలంగాణ సీఎంలకు లేఖలు రాస్తానని జగన్‌ వారికి హామీ ఇచ్చారు. ఈ సమస్యను రాష్ట్ర గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళతామన్నారు. వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు ఇంజనీర్ల ప్రతినిధి బృందాన్ని గవర్నర్ వద్దకు తీసుకెళతారని భరోసా ఇచ్చారు. మరి వీరికి న్యాయం చేసేలా అటు కేసీఆర్ ను.. ఇటు చంద్రబాబును జగన్ ఒప్పించగలరా..? ఈ ఇంజినీర్లకు న్యాయం చేయగలరా..?

మరింత సమాచారం తెలుసుకోండి: