తెలుగుదేశం పార్టీ తరపున తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 13 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే వీరిలో ఇప్పుడు టీడీపీలో ఎంతమంది ఉన్నారు? అంటే.. సమాధానం చెప్పడం మాత్రం సులభం కాదు. ఏపీలో అధికారంలో ఉన్నా... తెలంగాణలో అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చేసరికి టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీలో నిలబడలేకపోతున్నారు.

తమదారి తాము చూసుకొంటున్నారు. తాజాగా ఈ జంపింగుల జాబితాలో మాధవరం కృష్ణారావు పేరు వినిపిస్తోంది. ఈయన తెరాసలోకి చేరిపోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందుకే స్వయంగా లోకేష్ ఈయనను పిలిపించుకొని మాట్లాడని తెలుస్తోంది. అయితే లోకేష్ దగ్గర కొత్త బాంబు పేల్చాడట కృష్ణారావు.

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల్లో అందరూ టీఆర్ఎస్ తో టచ్ లోనే ఉన్నారని మాధవరం వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మరి అందరూ.. అంటే, అందరూ కేసీఆర్ తో టచ్ లో ఉన్నట్టేనని కృష్ణారావు స్పష్టం చేశాడట. బహుశా తనను కూడా కలుపుకొని ఈయన ఈ మాట చెప్పి ఉండాలి.

మరి ఈ లెక్కన చూసుకొంటే.. రానున్న నాలుగేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్ బాట పడతారేమో అనుకోవాల్సి వస్తోంది. అయితే.. రేవంత్ రెడ్డి మాత్రం దీనికి మినహాయింపు కాబోలు! టీఆర్ఎస్ కు, రేవంత్ రెడ్డికి జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం నేపథ్యంలో రేవంత్ టీడీపీ దిశగా వెళ్లకపోవచ్చు! మిగతా వాళ్లలో మాత్రం ఎవరూ టీడీపీకే పరిమితం అవుతారని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: