తెలంగాణ సచివాలయానికి సంబంధించి కేసీఆర్ సర్కారు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. హుస్సేన్ సాగర తీరాన ఉన్న సచివాలయం ఇక అక్కడి నుంచి తరలబోతోంది. ఇప్పటివరకూ పిచ్చాసుపత్రికి చిరునామాగా ఉన్న ఎర్రగడ్డ ఇకపై.. తెలంగాణ సచివాలయానికి కేరాఫ్ అడ్రస్ గా మారబోతోంది. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిని అక్కడి నుంచి నగరశివార్లకు తరలించి.. ఆ స్థలంలో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆ నిర్మించడం అలా ఇలా కాదు.. ఏకంగా వంద అంతస్తులతో భారీగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.  ఛాతీ ఆసుపత్రి స్థలంలో సచివాలయంతో పాటు.. మైదానం కూడా తయారు చేయబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ మైదానం లేకపోవడంతో.. అక్కడ మైదానం నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి సికింద్రాబాద్ పెరేడ్ మైదానం ఉన్నా.. అది మిలటరీ ఆధీనంలో ఉండటం వల్ల.. అనుమతుల సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తమ కంటూ సొంత మైదానం ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సచివాలయం ఉన్న ప్రాంతాన్నిఆకాశహర్మ్యాలు నిర్మించేందుకు ఉపయోగిస్తారు.  ప్రస్తుతం సచివాలయం పాలనకు అంత అనుకూలంగా లేదని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఇరుకు గదులు, భద్రత లోపాలు, పార్కింగు సమస్య వంటి ఇబ్బందులున్నాయని.. అందుకే సాధ్యమైనంత త్వరగా సచివాలయాన్ని మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఛాతీ ఆసుపత్రితో పాటు పిచ్చాసుపత్రిని కూడా మార్చాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. ఐతే..ఈ నిర్ణయాన్ని ఆసుపత్రుల సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: