వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ విశాఖలోని శ్రీ శారదా పీఠాన్ని మంగళవారం సందర్శించారు. పీఠం వార్షికోత్సవ సందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆహ్వానం మేరకు జగన్ ఇక్కడికి వచ్చారు. సాయంత్రం ఐదు గంటలకు శారదా పీఠానికి వచ్చిన జగన్‌కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో సుమారు 20 నిముషాలపాటు ఏకాంతంగా మాట్లాడారు. ఆ తరువాత పీఠం ప్రాంగణంలో ఉన్న వివిధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా పీఠంలో జరుగుతున్న ప్రత్యేక హోమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ విశాఖ శారదా పీఠానికి రావడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇదిలా ఉండగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ పీఠం వార్షికోత్సవం సందర్భంగా వివిధ వర్గాల ప్రముఖులు వచ్చి శారదా మాతను దర్శించుకుని వెళుతున్నారన్నారు. అందులో భాగంగానే జగన్ కూడా వచ్చారన్నారు. పీఠంలో నిర్వహిస్తున్న హోమాన్ని చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారన్నారు. వార్షికోత్సవ కార్యక్రమాలు ఈనెల 30వ తేదీ వరకూ కొనసాగుతాయని ఆయన చెప్పారు. జగన్ వెంట ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, సుజయకృష్ణ రంగారావు, తదితరులు ఉన్నారు. సింహాలేశుని దర్శించుకున్న జగన్ సింహాచలం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం సింహాచలంలో శ్రీ వరహాలక్ష్మీనృసింహస్వామివారిని దర్శించుకున్నారు.  ఆయనకు దేవస్థానం ఇవో కె.రామచంద్రమోహన్ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. జగన్ సాంప్రదాయ ప్రకారం తొలుత ఆలయ ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం కప్పస్తంభాన్ని అలింగనం చేసుకున్నారు. బేడ మండపంలో ప్రదక్షిణలు చేశారు. అంతరాలయంలో జగన్మోహన్‌రెడ్డి పేరున అర్చకులు అష్టోత్తర శతనామార్చన చేశారు. గోదాదేవి సన్నిధిలో మంగళహారతులిచ్చారు. ఆస్థాన మండపంలో నాదస్వర వాయిద్యాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ అర్చకులు ఆశీర్వదించారు. దేవస్థానం తరుపున ఇవో జగన్మోహన్‌రెడ్డికి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో జగన్మోహన్‌రెడ్డి మాట్లాడారు. వైఎస్సాఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే సింహాచలం దేవస్థానం భూ సమస్య పరిష్కరించేవారమని ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. దేవస్థానం భూ సమస్యపై తనకు అవగాహన ఉందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన హామీనిచ్చారు. జగన్‌ను చూసేందుకు అభిమానులు సింహగిరికి భారీగా తరలివచ్చారు. వారికి అభివాదం చేసుకుంటూ ఆయన స్వామి దర్శనం చేసుకుని వెళ్ళారు.

మరింత సమాచారం తెలుసుకోండి: