స్వదేశీ నినాదం తమదిగా బి.జె.పి చెప్పుకుంటుంది. బి.జె.పి మాతృ సంస్ధ ఆర్.ఎస్.ఎస్ లో ఆర్ధిక విభాగం పేరే ‘స్వదేశీ జాగరణ్ మంచ్.’ విదేశాలకు, ముఖ్యంగా అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించాలని ఈ సంస్ధ అనేక శతాబ్దాల పాటు పుస్తకాలు ప్రచురించి మరీ బోధించింది. అలాంటి స్వదేశీ బి.జె.పి తీరా అధికారానికి వచ్చాక పక్కా విదేశీ విధానాలను కాంగ్రెస్ కంటే ఎక్కువగా వాటేసుకుని అమలు చేయడాన్ని ఎలా అభివర్ణించాలి? ప్రపంచ దేశాలపై పెత్తనం చేసే అమెరికా ప్రభుత్వాధిపతులను, ఒక అలీన దేశంగా, రిపబ్లిక్ డే రోజున అతిధిగా పిలవకుండా ఇన్నాళ్లూ ప్రభుత్వాలు సంయమనం పాటించాయి. ఆ సంయమనం కాస్తా మోడి హయాంలో గంగలో (బహుశా వారణాసి వద్దనే) కలిపివేయబడింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ప్రధాని మోడి దేశ ప్రజలకు ఉత్తుత్తి నినాదాలు, ఊకదంపుడు ప్రసంగాలు ఉదారంగా పంచి పెడుతూ విదేశీ కంపెనీలకు మాత్రం దేశ వనరులను అప్పనంగా కట్టబెట్టే చట్టాలను పందేరం పెడుతున్నారు. చట్టాలు సాధ్యం కానిచోట ఆర్డినెన్స్ లు తెస్తున్నారు. ఫలితంగా స్వదేశీ నినాదం నినాదంగా కూడా మాయమైపోయింది. రిపబ్లిక్ డే ప్రకటనలో భారత రాజ్యాంగం పీఠిక నుండి ‘సోషలిస్టు, సెక్యులర్’ పదాలను తొలగించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు కేంద్ర ప్రభుత్వం పాల్పడింది. ఒబామాకు రిపబ్లిక్ డే ఆతిధ్యం మాత్రమే ఇచ్చారో లేక భారత రాజ్యం యొక్క రిపబ్లిక్ స్వభావాన్నే ఇచ్చేశారో ప్రశ్నించుకోవలసిన అవసరం భారత ప్రజలకు వచ్చిపడింది. ఒబామా వచ్చిన రోజే ఇరు దేశాల మధ్య 2004లో చేసుకున్న ‘పౌర అణు ఒప్పందం’ అను అమలులోకి తెచ్చే అవగాహన కుదిరిపోయిందని ప్రకటించారు. ఈ అవగాహన ఎంత స్వదేశీయంగా ఉందంటే అణు ఒప్పందం మరియు అణు చట్టాల విషయమై ఒబామాకు ఏయే హామీలు ఇచ్చారో ఇంతవరకు కేంద్రం ప్రజలకు చెప్పనేలేదు. అణు ఒప్పందాన్ని అమలులోకి తెనున్న అంశాలు ఇప్పుడు అమెరికా పాలకులకు తెలుసు గానీ భారత ప్రజలకు మాత్రం తెలియదు. బి.జె.పి/మోడి మార్కు స్వదేశీ ఇదేనా?! రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా ఆకాశంలో విన్యాసాలు ప్రదర్శిస్తున్న ఆ విమానాలను చూడండి! అవి వదిలిన పొగలు ఆకాశంలో డాలర్ గుర్తును ఏర్పరిచాయి. భారత రిపబ్లిక్ రాజ్యంలోకి డాలర్ చొరబడిపోయిందని దానికి దేశ ప్రధాని గారే కర్తగా నిలిచారని కార్టూనిస్టు చెబుతున్నారు. నిజంగా నిజం!

మరింత సమాచారం తెలుసుకోండి: