ఇస్లామిక్ తీవ్రవాదం ద్వారా భారత్‌పై పరోక్ష యద్ధం చేస్తున్న పాకిస్తాన్ తాను తీసుకున్న గోతిలో తానే పడిపోతోంది. పేషావర్‌లోని సైనిక పాఠశాలపై ‘తెహరీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ ’కు చెందిన ఇస్లామిక్ తీవ్రవాదులు దాడి జరిపి దాదాపు నూటా యాభై మంది అనె్నం, పునె్నం ఎరగని అమాయక బాలలు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని పొట్టన పెట్టుకోవటానికి ప్రధాన హేతువు పాకిస్తాన్ పాలకులు ముఖ్యంగా సైనిక పాలకులు, పాకిస్తాన్ గూడచార సంస్థ ఐ.ఎస్.ఐ అనుసరిస్తున్న విధానాలే. మొదట అఫ్గానిస్తాన్‌లోనూ ఆ తరువాత భారత పై ప్రచ్ఛన్న యుద్ధం చేసేందుకు తాలిబన్లను పాకిస్తాన్ సైన్యం, ఐఎస్‌ఐ సృష్టించాయ. పాక్ పెంచి పోషించిన ఈ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ తీవ్రవాదానికి కేంద్ర బిందువుగా మారింది.

తాలిబన్లతో పాటు లష్కరే తయ్యబా వంటి పలు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల సృష్టికర్త పాకిస్తాన్. పాకిస్తాన్ దృష్టిలో మంచి తాలిబన్, చెడ్డ తాలిబన్ అనేవి ఉన్నాయి. భారత్, అఫ్గానిస్తాన్‌లో ప్రత్యర్థులపై దాడులు జరిపే తాలిబాన్ మంచి తాలిబన్. పాకిస్తాన్ లోపల తీవ్రవాదానికి పాల్పడే తాలిబన్ చెడ్డ తాలిబన్ అనేది పాకిస్తాన్ ఇంత కాలం ఇస్తున్న నిర్వచనం. ఎవరికి జరిగినా చెరుపు చెరుపే అనే పచ్చి నిజం పాకిస్తాన్ పాలకులకు తెలియకకాదు. తన వరకు రానంత వరకు అది మంచిదే. అయితే ఇంత కాలం చెప్పుచేతల్లో ఉన్న తాలిబన్లు ఇప్పుడు ఎదురు తిరగటంతో పాకిస్తాన్ పాలకులు, సైన్యం, ఐ.ఎస్.ఐ ఇప్పుడు తల్లడిల్లిపోతున్నారు.

వజీరిస్థాన్‌లోని తాలిబన్ల స్థావరాలపై సైన్యం దాడులు జరుపుతోంది. తాలిబన్లను మట్టుపెట్టేంత వరకు మడమ తిప్పేది లేదంటూ పాక్ సైన్యం ప్రకటనలు జారీ చేస్తోంది. ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్‌లో ఇస్లామిక్ చట్టం షరియత్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న తాలిబన్లు తమ లక్ష్య సాధన కోసం పాకిస్తాన్‌లోని పలు చోట్ల ఆత్మాహుతి దాడులు జరుపుతున్నారు. భస్మాసుర హస్తంగా మారిన తాలిబన్లను భరించటం పాకిస్తాన్‌కు తలకుమించిన భారంగా పరిణమించింది. పాకిస్తాన్‌లో దాడులు జరుపుతున్న తాలిబన్ తీవ్రవాద సంస్థ అయితే భారత్‌పై తరచూ దాడులు చేస్తున్న లష్కరే తయ్యబా తీవ్రవాద సంస్థ కాదా? లష్కరే తయ్యబా అధినాయకుడు హఫీజ్ సరుూద్‌ను అనుక్షణం కాపాడే పాకిస్తాన్ పాలకులకు ఇస్లామిక్ తీవ్రవాదం భస్మాసుర హస్తం లాంటిదనేది ఇంకా అర్థం కాకపోతే ఎలా? పెషావర్ సైనిక పాఠశాలపై దాడి చేసిన తాలిబన్లను నామరూపాలు లేకుండా చేస్తామంటున్న పాకిస్తాన్ పాలకులు ముంబయిపై దాడికి కుట్ర చేసిన లష్కరే తయ్యబా తీవ్రవాద నాయకుడు జకీఉర్ రహమాన్ లఖ్విని జైలు నుండి ఎలా విడుదల కానిస్తారు? లఖ్వి నిందితుడు అనేది రుజువు చేసేందుకు అవరమైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు విడుదల చేసింది. కోర్టు ముందు పటిష్టమైన సాక్ష్యాలను పెట్టకుండా ఆపింది పాకిస్తాన్ పాలకులు కాదా? లఖ్వి విడుదల కావాలనే దురుద్దేశ్యంతోనే ముంబయి దాడికి సంబంధించిన సరైన సాక్ష్యాలను పాకిస్తాన్ దర్యాప్తు సంస్థలు కోర్టు ముందు పెట్టలేదు.అందుకే కోర్టు లఖ్విని విడుదలు చేయాలని ఆదేశించింది.

పెషావర్ సైనిక పాఠశాలపై తాలిబాన్‌లు దాడి చేసిన తరువాత రెండోరోజే పాకిస్తాన్ పాలకులు ముంబాయి దాడిలో ప్రధాన కుట్ర దారుడైన లఖ్విని విడుదల చేయించటం తీవ్రవాదం పట్ల పాకిస్తాన్ పాలకులకు ఉన్న ద్వంద్వనీతిని వెల్లడిస్తోంది. అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించేందుకు పాకిస్తాన్ తరపున పోరాడుతున్న తాలిబన్లు చెడ్డవారు కాదు, అదే విధంగా భారత్‌లో దాడులు చేయిస్తున్న లష్కరే తయ్యబా వంటి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ చెడ్డది కాదు, కేవలం పాకిస్తాన్‌లో దాడులు చేస్తున్న పాకిస్తాన్ తాలిబన్లు మాత్రమే తీవ్రవాదులు అనే పాక్ పాలకుల విధానం అత్యంత భయంకరమైంది. ఈ సిద్ధాంతమే చివరకు పాకిస్తాన్‌ను నామరూపాలు లేకుండా చేసే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే పాకిస్తాన్‌లో పాలన అనేది లేకుండా పోయింది. పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో ఇస్లామిక్ తీవ్రవాదుల ప్రాబల్యం, మిగతా ప్రాం తాల్లో సైన్యం లేదా గూడచార సంస్థ ఐ.ఎస్.ఐ ఆధిపత్యం కొనసాగుతోంది. పాకిస్తాన్‌లో ఒక పద్దతి, పాడు అనేది లేకుండా పోయిం ది. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే పాకిస్తాన్‌లో పూర్తి స్థాయి అరాచకం నెలకొంటుంది. పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే అరాచకం చోటు చేసుకున్నది. ప్రభుత్వ పాలన కానరావడంలేదు. తుపాకి ఉన్న వాడిదే రాజ్యం అన్న నీతి కొనసాగుతోంది. పేషావర్ సైనిక పాఠశాలపై తామే దాడి చేయించామని తాలిబన్లు ప్రకటించటంతోపాటు నరహంతకుల ఫోటోను విడుదల చేసిన తరవాత కూడా పాకిస్తాన్‌కు చెందిన కొందరు ఈ దాడి వెనక భారత హస్తమున్నదంటూ తప్పుడు ప్రచారం చేయటం పాకిస్తాన్ పాలకుల మానసిక స్థితికి అద్దం పడుతోంది. ఇస్లామిక్ తీవ్రవాదం మంచిది కాదనే విషయం తెలిసి కూడా దానిని వెనకేసుకు వస్తున్న పాకిస్తాన్ ఏదోఒక రోజు అత్యంత భారీ మూల్యం చెల్లింక తప్పదు. పాకిస్తాన్ ముక్కలయ్యేటంతటి భారీ మూల్యం చెల్లించినా ఆశ్చర్యపోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: