కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు చూస్తే.. ఆస్తిమూరెడు.. ఆశ బారెడు.. అన్న సామెత గుర్తురాకమానదు. అక్కడ కేంద్రంలో మోడీ గానీ..ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలు కానీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నాయి. ఎన్నికల్లో ముగ్గురూ జోరుగా ప్రజాకర్షక హామీలు గుప్పించిన వారే.. ఐదేళ్లలో 60ఏళ్ల అభివృద్ధిని మరిపిస్తానని మోడీ సార్ భారీగానే కోతలు కోసేశారు. ఇక్కడ చంద్రబాబు ఇచ్చిన హామీలైతే ఇక లెక్కేలేదు.. కేంద్రం బడ్జెట్ అంతా తీసుకొచ్చినా.. ఆ హామీలు నెరవేర్చడం కష్టమేనంటూ విపక్షాలు సరదగా విమర్శిస్తుంటాయి కూడా.  మరి.. ఈ ఆకర్షక పథకాలకు నిధులు ఎక్కడ నుంచి తీసుకురావాలి. ఇదే ఇప్పుడు మూడు ప్రభుత్వాలనూ వేధిస్తున్న ప్రశ్నలు..అందుకోసం.. ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేస్తున్నారు. బాబు, కేసీఆర్... కేంద్రం వైపు సాయం కోసం చూస్తుంటే..ఆయన అంత సీన్ లేదని మొండిచేయి చూపుతున్నారు. ఊహించినంత కాకుండా.. పదో పరకో విదిలిస్తూ.. కాలం నెట్టుకొస్తున్నారు. ఇలాంటి కీలకమైన సమయంలో మోడీ సర్కారుకు ఓ అద్భుతమైన అవకాశం అందివచ్చింది. ఏకంగా లక్ష కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే.. బ్రహ్మాండమైన వనరు లభించింది.  అదే స్పెక్ట్రమ్ వేలం అవకాశం. 2జీ స్పెక్ట్రమ్ వేలం అమ్మకాల్లో అవినీతి ఎంత సంచలనం సృష్టించాయో తెలియని విషయమేమీ కాదు.. అందుకే ఈసారి స్పెక్ట్రమ్ వేలాన్ని పారదర్శకంగా.. లాభదాయకంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దీని వేలం ద్వారా లక్ష కోట్ల రూపాయలు సంపాదించాలని టార్గెట్ పెట్టుకుంది. 3జీ మొబైల్ సేవలకోసం ఉపయోగపడే 2వేల 100 మెగాహెడ్జ్ బ్యాండ్ కు జరిగే వేలంలో కనీస ధరను మెగాహెడ్జ్ కు 3వేల 705 కోట్లుగా కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే 800 మెగాహెడ్జ్ , 900, 1800 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్ వేలం కోసం కనీస ధరలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వీటన్నిటి వేలం ద్వారా ఖజానాకు లక్ష కోట్లు వచ్చే అవకాశముందని అంచనా. ఇదే ఇప్పటివరకు అతిపెద్ద స్పెక్ట్రం వేలం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: