అరబ్‌ ప్రపంచంలో అమెరికాకు నమ్మకమైన మిత్రదేశం సౌదీ అరేబియాయే. అయితే,అరబ్‌ స్ట్రింగ్‌ పేరిట అరబ్‌ దేశాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల్లో అమెరికా వహించిన పాత్ర పట్ల కినుక వహించిన సౌదీ అరేబియా ఎప్పటి మాదిరిగానే అమెరికాకు మిత్రదేశంగా కొనసాగుతుందా?లేక సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా మరణం కారణంగా ఆ దేశం తన వైఖరిని పునస్సమీక్షించు కుంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అరబ్‌ దేశాల్లో ఎన్ని మార్పులు, తిరుగుబాట్లు, కలహాలు,ఘర్షణలు జరిగినప్పటికీ సౌదీ అరేబియా తన ప్రతిపత్తినీ, ఆధిపత్యాన్నీ కాపాడుకుంటూ అగ్రరాజ్యానికి మిత్రదేశంగా కొనసాగుతోంది. అయితే,ఇరాక్‌, ఈజిప్టు,టునీసియా తదితర దేశాల్లో చోటుచేసుకున్న పరిణామాల్లో ముస్లింలలో షియాతెగ నాయకులతో అమెరికా ఎక్కువ సంబంధాలుపెట్టుకోవడమే కాకుండా,ఆ తెగవారినే గద్దెనెక్కించడం సౌదీ అరేబియాకు అసంతృప్తిని కలిగించింది.ఇరాన్‌లో షియా తెగ నాయకులతో అమెరికన్‌ ప్రభుత్వాధినేతలకు రహస్య సంబంధాలు ఉన్నాయన్నది సౌదీ అనుమానం.దానికి తగ్గట్టుగానే, ఇరాన్‌ అధ్యక్ష పదవి నుంచి అహ్మద్‌ నెజాద్‌ గద్దె దిగిన తరువాత ఆ దేశంతో సామరస్యంగా మెలిగేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.నెజాద్‌ అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకించడమే కాకుండా, శాంతియుత ప్రయోజనాల కోసం తమ దేశం సాగించే అణు కార్యక్రమంపై అమెరికా అభ్యంతరాలను సమయంవచ్చినప్పుడల్లా తీవ్రంగా ఎండగట్టేవారు.అక్కడ నెజాద్‌ గద్దె దిగిన తరువాత ఇరాన్‌తో అమెరికా దూకుడు తగ్గించింది.అలాగే,ఇరాక్‌లో సున్నీ తెగకు చెందిన సద్దాం హుస్సేన్‌ రహస్యంగా రసాయనిక ఆయుధాలను తయారు చేయిస్తున్నాడన్న అభియోగంపై అతడిని గద్దె దింపే వరకూ విశ్రమించని అమెరికా,అతడి స్థానే షియా తెగకు చెందిన అబ్బాస్‌ని పట్టాభిషిక్తుణ్ణి చేయడం కూడా సౌదీకి నచ్చలేదు. సిరియాలో అధికారంలో ఉన్న అసద్‌ బషర్‌ రహస్యంగా రసాయనిక ఆయుధాలను తయారుచేయించడమే కాకుండా,సున్నీలపై దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ అమెరికా నోరు మెదపడం లేదన్న అసంతృప్తి సౌదీ రాజు అబ్దుల్లాకు ఉండేది.అమెరికాకు నమ్మకమైన మిత్ర దేశంగా సౌదీ తన వారిని సైతం లెక్క చేయకుండా దాడులు జరిపించేందుకు అమెరికాకు పూర్తి తోడ్పాటును అందించింది. ఉదాహరణకు అల్‌ఖైదా అనే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు బిన్‌ లాడెన్‌ సౌదీ అరేబియాకు చెందిన సున్నీ నాయకుడే,అతడు అమెరికా ప్రాపకంతోనే నాయకుడయ్యాడు. ఆ తరువాత ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్లకు దగ్గర కావడంతో సహజంగానే అమెరికాకు దూరమయ్యాడు. అమెరికాలోని వాషింగ్టన్‌,న్యూయార్క్‌ నగరాలపై అల్‌ఖైదా సభ్యులను ఉసిగొల్పినందుకు లాడెన్‌ కోసం వేటలో,చివరికి అతడిని అంతమొందించడంలో అమెరికాకు సౌదీ అరేబియా సంపూర్ణ సహాయాన్ని అందించింది. సిరియాలో అసద్‌ బషర్‌కి వ్యతిరేకంగా సౌదీ అరేబియా సున్నీ తెగకు చెందిన తిరుగుబాటుదారులను ప్రోత్సహించడమే కాకుండా, ఆర్ధిక, ఆయుధ సాయాన్ని అందించింది.ఆ తిరుగుబాటు దారులను అణచివేసేందుకు అమెరికా సిరియాకు పూర్తిగా తోడ్పడింది.సిరియాలో అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ అల్‌ఖైదాలోని సున్నీలు ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ సిరియా అండ్‌ ఇరాక్‌ (ఐఎస్‌ఐఎస్‌) పేరిట కొత్తగా ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశారు.ముస్లిం తెగల మధ్య ఉన్న సహజవైరాన్ని ఆసరాగా చేసుకుని అమెరికా విభజించు పాలించు సిద్ధాంతాన్నిఅనుసరిస్తోందన్న అసంతృప్తి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాలో ఉండేది.సౌదీఅరేబియా రాజును బుజ్జగించేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా గత ఏడాది తన విదేశాంగ మంత్రి జాన్‌ కెర్రీని రియాద్‌ పంపారు. చమురు సంపన్న దేశమైన సౌదీతో వైరం తెచ్చుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయన్న సంగతి అమెరికాకు తెలుసు. అయితే, ఈజిప్టు, సిరియా, టునీసియా, ఆఫ్ఘనిస్థాన్‌,ఇరాక్‌ తదితర దేశాల్లో తన తాబేదారులను గద్దె నెక్కించిన అమెరికా వారిని ఆయా పదవుల్లో శాశ్వతంగా కొనసాగించేందుకు ఆయుధ, అర్ధబలాలను సమకూరుస్తోంది.ఉదాహరణకు సిరియాలో అసద్‌ బషర్‌ అంత ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న పాలకులు ఎవరూ లేరు. అయినప్పటికీ, అతడిని ఆ పదవిలో కాపాడేందుకు అమెరికా అందించని సాయమంటూ లేదు. ఇవన్నీ దివంగత సౌదీరాజు అబ్దుల్లాకు తెలుసున్నా, అన్నీ దిగమింగుకుంటూ అమెరికాకు మిత్రునిగా వ్యవహరిస్తూవచ్చారు.ఇప్పుడు ఆయన కన్నుమూయ డంతో ఆయన స్థానే రాజ్యాధికారాన్ని చేపట్టిన ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ నయీఫ్‌ అబ్దుల్లా మాదిరిగా మిత్రునిగా కొనసాగు తారా?లేక సొంత వైఖరిని తీసుకుంటారా అనే అనుమానం అమెరికాలో ఉంది. అందుకే, సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా మరణవార్త వినగానే,అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత పర్యటనను కుదించుకుని ఢిల్లి నుంచి నేరుగా రియాద్‌కి పయనమయ్యారు. కొత్త రాజుని పరామర్శిం చడంతో పాటు, అతడి వైఖరేమిటో స్వయంగా తెలుసుకునేందుకే ఒబామా అంత హుటాహుటి వెళ్ళారు. అయితే, విమానాశ్రయంలో ఒబామా సతీమణి మిషెల్‌కు సరైన రీతిలో స్వాగతం లభించకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తి చెందినట్టు వార్తలు వచ్చాయి.సౌదీఅరేబియాలో మహిళలపై ఇప్పటికీ కొనసాగుతున్న ఆంక్షల పట్ల ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలియవచ్చింది. అంతేకాక,ఆమె గతంలో ఇండోనేషియాలోని మసీదును సందర్శించినప్పుడు తలపై ఆచ్ఛాదన వేసుకున్నదట. ఈసారి రియాద్‌ పర్యటనలో అటువంటి నియమాన్ని పాటించకపోవడం వల్ల ఒబామా పర్యటన చిత్రాల్లో ఆమె లేకుండా సౌదీ మీడియా జాగ్రత్తలు తీసుకున్నదట.అది కూడా ఆమె అసంతృప్తికి కారణం కాగా,దివంగత సౌదీ రాజు అబ్దుల్లా అమెరికాతో మొదటి నుంచి నిర్మొహమాట వైఖరినే అనుసరిస్తూవచ్చారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడులను అరికట్టకపోతే అమెరికాతో సంబంధాలపై సమీక్షిస్తామని పద్నాల్గేళ్ళ క్రితమే హెచ్చరించారు. అలాగే, సిరియాపై అమెరికా వైమానిక దాడులు జరపనందుకు కినుక వహించారు . చమురుఉత్పత్తిని తగ్గించాలన్న డిమాండ్‌ని అబ్దుల్లా ఖాతరు చేయలేదు. చమురు ధర అంతర్జాతీయమార్కెట్‌లో బాగా పడిపోయిన నేపధ్యంలో చమురు ఉత్పత్తి తగ్గించేట్టు ఒపెక్‌ దేశాలపై అమెరికా ఒత్తిడి తెచ్చింది. ఇరాన్‌తో అమెరికా రహస్య సంబంధాలు పెట్టుకుందన్న అనుమానం అబ్దుల్లాకు ఉండేది.జాన్‌ కెర్రీ తనను కలిసినప్పుు డు ఈ విషయాన్ని దివంగత రాజు అబ్దుల్లా నేరుగానే ప్రస్తావించారట.అలాగే.అబ్దుల్లా తన హయాంలో విదేశీ కార్మికులు,ఉద్యోగులపై ఆధారపడే ధోరణిని క్రమంగా విడనాడాలని తరచుగా చెప్పేవారట.అయినప్పటికీ,సౌదీలో ఇప్పటికీ30 శాతం మంది విదేశీయులు పనిచేస్తున్నారు. సంస్కరణలవాదిగా పేరు తెచ్చుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేసినా,300 సంవత్సరాలుగా సౌదీని పరిపాలిస్తున్న అబ్దుల్లా కుటుంబం సంప్రదాయాలను ఇప్పటికీ కాపాడుతూనే ఉంది.అదే సందర్భంలో అరబ్‌ దేశాల్లో తిరుగుబాటు దారులకు సౌదీఅరేబియా ఆయుధ,ఆర్థిక సాయాన్నిఅందిస్తూనే ఉంది.సౌదీ అరేబియాను దూరం చేసుకుంటే కష్టమన్న సంగతి అమెరికాకుతెలుసు.అందుకే, సౌదీ కొత్త రాజుగా బాధ్యతలను స్వీకరించిన నయీఫ్‌తో చర్చల కోసం ఒబామా హడావుడిగా భారత్‌ పర్యటన ముగించుకుని రియాద్‌ చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: