స్వైన్‌ఫ్లూ నుంచి తెలంగాణ ఇంకా బయటపడలేదు. రోజు రోజుకు కాదు.. గంటగంటకు రోగుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య 26కు చేరింది. దీంతో రాష్టవ్య్రాప్తంగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తీవ్ర జ్వరంతో గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రులకు రోగులు వస్తూనే ఉన్నారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు 141 కేసులు నమోదయ్యాయి. వీటిలో 57మంది రక్తనమూనాలను తీసుకుని పరీక్ష నిమిత్తం పంపించగా, వారిలో 22మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్థారణయ్యింది. మిగతా వారి రక్త నమూనాలు సేకరించి పరీక్ష నిమిత్తం పంపించాల్సిం ఉందని ‘నిమ్స్’ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ బుధవారం మీడియాకు తెలిపారు.

2009లోనూ స్వైన్‌ఫ్లూ ప్రజలను వణికించిందని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు మృతుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. అప్పట్లో వందకు 10 శాతం మంది మరణిస్తే, ఇప్పుడు 3.6 శాతానికి మించలేదని తెలిపారు. వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందని చెప్పలేమన్నారు. వ్యాధి లక్షణాలు పూర్తిగా నయం అయ్యేంత వరకూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావద్దని రోగులకు సూచించారు. వ్యాధి సోకిన వారు ఇంటి దగ్గరే మందులు వాడుతామని ఆసుపత్రి నుంచి వెళ్ళిపోరాదన్నారు.

సిఎం చంద్రశేఖర్ రావు వినతి మేరకు కేంద్రం రక్తనమూనాల పరీక్షలు నిర్వహించే యంత్రం అందించనున్నట్టు తెలిపారు. ఇలాఉండగా 25న నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో వ్యక్తి మరణించగా, ఈ రోజున ఆ ఆసుపత్రి డాక్టర్లు సమాచారం అందించారని తెలిపారు. బుధవారం ఒక్కరు కూడా మరణించలేదన్నారు. గత నెలలో 9మంది మరణించగా, ఈ నెలలో 17మంది మరణించారని చెప్పారు. జ్వరం వచ్చి, స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్థారణ కాని రోగులను నగరంలోని ఫీవర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నామని అన్నారు. పూర్తిగా రోగం నయం కాకుండానే డిశ్చార్జీ అవుతామని తొందర పెట్టవద్దని ఆయన తెలిపారు.

.

మరింత సమాచారం తెలుసుకోండి: