సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర పరిధిలో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 13. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి వారు సీమాంధ్ర పార్టీగా ప్రచారం చేశారు. అది మన పార్టీ కాదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఎలాంటి పోరాటమూ చేయలేదని ప్రచారం చేశారు.

ఈ ప్రచారం బాగానే పనిచేసిందో ఏమో కానీ.. తెలంగాణలో జిల్లాల్లోనూ, రూరల్ ఏరియాల్లోనూ తెలుగుదేశం పార్టీ అంతగా ప్రభావం చూపలేకపోయింది. గ్రేటర్ హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే తన సత్తాను అంతో ఇంతో చాటగలిగింది. ఈ నేపథ్యంలో టీడీపీకి 13 సీట్లు దక్కాయి.

ఏపీలో అధికారాన్ని దక్కించుకొన్న టీడీపీ ఈ 13 సీట్ల సంఖ్యను వచ్చే ఎన్నికల నాటికి అధికారానికి చేరువయ్యేంత స్థాయికి పెంచుకోవాలని భావించింది. బాగా కష్టపడితే అధికారాన్ని సాధించుకోవడం పెద్ద కష్టం కాదని కూడా బాబు టీడీపీ నేతలకు సూచిస్తూ వచ్చాడు. తద్వారా వారిలో స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నించాడాయన.

అయితే పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం బాబు అందించిస్ఫూర్తి అంట లేదు. చాలా మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు మొగ్గుచూపారు. ఎమ్మెల్యే హోదాను పణంగా పెట్టి మరీ వారు టీడీపీ నుంచి టీఆర్ఎస్ వైపు వెళ్లిపోయారు. చివరగా బుధవారం తెలుగుదేశం అధ్యక్షుడు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడితే.. దానికి హాజరయ్యింది ఐదు మంది!ఇప్పటికే జంప్ అయిన వారు..జంపింగ్ ప్రయత్నాల్లో ఉన్న వారు పోగా.. తెలుగుదేశం పార్టీ ఖాతాలో ప్రస్తుతానికి ఐదు మంది ఎమ్మెల్యేలు మిగిలినట్టుగా తెలుస్తోంది. వీరిలో కృష్ణయ్య పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగానే ఫీల్ కావడం లేదు. ఆయన దృష్టంతా కొత్త పార్టీ ని ఏర్పాటు చేయడం మీదే ఉందట. మరి ఇలాంటి వారు కూడా మైనస్ అయితే.. ఐదేళ్లు పూర్తయ్యే సరికి టీడీపీ ఖాతాలో మిగిలే సంఖ్య ఎంతో!

మరింత సమాచారం తెలుసుకోండి: