ప్రభుత్వ భూములు వేల ఎకరాలు ఉండగా.. రాజధాని నిర్మాణానికి పంట భూములను తీసుకోవాలని అనుకోవడమే అత్యంత దారుణమైన అంశం. ఏపీకి నూతన రాజధాని నిర్మాణం విషయంలో ఏర్పాటు అయిన కమిటీని కాదని... బాబు ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకొని పంటభూములున్న ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ విషయంలో రైతుల అభ్యంతరాలనూ... సామాజిక ఉద్యమకారుల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోలేదు.

మేము భూములు ఇవ్వము.. అని అభ్యంతరం చెప్పిన రైతులను ప్రభుత్వం లెక్కలోకే తీసుకోవడం లేదు. అసలు రైతులకు ఆ భూముల మీద ఎలాంటి హక్కూ లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పరిహారం గురించి ఏదో ఒక నోటి మాట చెప్పేసి.. భూములను లాక్కోవడానికి చట్టం చేసింది. ఎవరో కొంతమంది రైతులను చూపి.. అనుకూల మీడియా ద్వారా రైతులంతా భూములు ఇవ్వడానికి యమ తాపత్రయపడుతున్నారనే అభిప్రాయాన్ని వినిపించింది ఏపీ ప్రభుత్వం.

మరి ఇదంతా ఒక ఎత్తు అనుకొంటే.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రైతులకు మరో షాక్ ఇచ్చింది. రాజధాని ప్రతిపాదితన ప్రాంతంలో వచ్చే సీజన్ నుంచి పంటల సాగుకు వీలు లేదని స్పష్టం చేసింది. దీంతో ఏకంగా 34 వేల ఎకరాల పరిధిలో పంటలు పండించడానికి అవకాశం లేకుండా పోనుంది. మూడు పంటలు పండే సామర్థ్యం ఉన్న అన్ని వేల ఎకరాల నుంచి ఎంత పంట వస్తుంది.. ఎంతమంది ఆ భూముల్లో వ్యవసాయం చేయడం మీద ఆధారపడి బతుకుతున్నారు.. అనే అంశాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఆ భూముల్లో పంటలు సాగు చేయడానికి వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది.

మరి భూముల సేకరణలోనూ రైతుల అభిప్రాయానికి విలువ లేదు.. వారు ఇవ్వము అని అంటున్నా బలవంతంగాస్వాధీనం చేసుకోవడానికి రెడీ అయిపోయి.. ఇంకా రాజధాని గురించి సరైన ప్రణాళిక, డబ్బు గురించి క్లారిటీ ఇవ్వకుండానే అప్పడే రైతులు ఆ భూముల్లో పంటలు సాగు చేయకూడదని అనడం ఎంత అన్యాయమో వేరే వివరించనక్కర్లేదు. అయితే ప్రభుత్వం ఏదో పెట్టుబడిదారులా, నియంతలా వ్యవహరిస్తూ ముందుకుపోతోంది. మరి దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో!

మరింత సమాచారం తెలుసుకోండి: