వాస్తుపై సమాజంలో అనేక వాదనలు ఉన్నాయి. ఆ దిక్కులు.. అవి ఉండకూడదు.. ఈ దిక్కులో ఇవి ఉండకూదని.. వాస్తు ప్రకారం పూర్తిగా నిర్మించిన భవనాలు కూడా కూల్చేయడం చూస్తుంటాం. సైన్సు ప్రకారం.. భూమి సూర్యుని చుట్టూ నిరంతరం తిరుగుతూ ఉంటే..ఇక దిక్కులకు ప్రాముఖ్యత ఏముందని హేతువాదులు వాదిస్తారు. ఐతే.. వారి వాదన ఎలా ఉన్నా.. సమాజంలో వాస్తు ప్రాముఖ్యత మాత్రం పెరిగిపోతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రులు, మంత్రులే వాస్తు ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటుంటే.. ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది. ఏపీ సీఎం చంద్రబాబు విషయానికి వస్తే.. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ.. రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎంతో తేడా ఉంది. మధ్య పదేళ్ల సమయంలో ఆయనకు తగిలిన ఎదురుదెబ్బల ప్రభావమో ఏమో కానీ.. వాస్తు, ముహూర్తాలు చూడకుండా ఏపనీ చేయడం లేదు. ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి.. ఎటు కదలాలన్నా.. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా..జ్యోతిష్యం, వాస్తు లేకుండా అడుగు ముందుకు వేయడం లేదు.  ఏపీ రాజధాని విషయంలోనూ అంతే.. రాజధానికి ఉత్తరంగా నది ఉండటం చిదన్న సెంటిమెంట్ తోనే.. తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. మూడు పంటలుపండే భూములు కాబట్టి.. ఆ ప్రాంతం వదిలేయాలని ఎందరు మొత్తుకున్నా.. వినకపోవడానికి వాస్తు సెంటిమెంటే కారణమన్నది బహిరంగ రహస్యం.  ఇక ఇప్పుడు.. తాత్కాలిక రాజధాని విషయంలోనూ.. అదే సీన్ రిపీటవుతోంది. వాస్తు ప్రకారం బాగా ఉందనే కారణంతోనే.. తాత్కాలిక రాజధానిని..మంగళగిరి సమీపంలోని.. సింగపూర్ టౌన్ షిప్పులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ టౌన్ షిప్.. అమరావతి టౌన్ షిప్పులో భాగం. 22 ఎకరాల్లో ఉన్న ఈ సింగపూర్ టౌన్ షిప్పును ప్రభుత్వం తీసుకుని.. అంతే మొత్తంలోని భూమిని టౌన్ షిప్ యజమానికి ఇవ్వాలని నిర్ణయించారట. ఈ మేరకు భూమార్పిడిపై త్వరలోనే ఒప్పందం జరగనుందట. అన్ని రకాలుగా బావుంటే పరవాలేదు.. కానీ కేవలం వాస్తు బావుందని.. నిర్ణయాలు తీసుకుంటే.. మాత్రం ముందు ముందు ఇబ్బందులు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి: