తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య బర్తరఫ్ కు దారి తీసిన కారణాల్లో స్వైన్ ఫ్లూ ఒకటి. హైదరాబాద్ నగరంలో విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ ప్రమాద ఘంటికలు ముందే మోగుతున్నా.. ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి. అంతేకాక.. స్వైన్ ఫ్లూ గురించి విపక్షాలు హెచ్చరించినా.. అసలు స్వైన్ ఫ్లూ లేదని.. ఉన్నా ప్రమాదంలేదని కాంట్రావర్సి కామెంట్లు చేశారు. ఆ తర్వాత స్వైన్ ఫ్లూ విజృంభణతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి వచ్చింది. దీనికితోడు అవినీతి ఆరోపణలూ తోడై.. పదవి పోగొట్టుకున్నారు.  ఐతే.. రాజయ్యను బర్తరఫ్ చేసినా.. తెలంగాణలో స్వైన్ ఫ్లూ విజృంభణ ఏమాత్రం తగ్గలేదు.. రోజుకు రెండు, మూడు మరణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కొత్తగా రోజుకు 50 మంది వరకూ ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఇప్పుడు ఇదే అంశంపై రాజకీయవిమర్శలకూ కారణమవుతోంది. స్వైన్ ఫ్లూ అరికట్టలేదని రాజయ్యను పదవి నుంచి తొలగించిన కేసీఆర్.. ఇప్పుడేం చేస్తారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. రాజయ్యను తొలగించినా స్వైన్ ఫ్లూ మరణాలు కొనసాగుతున్నందువల్ల.. ఇక ఇప్పుడు పదవి నుంచి తొలగాల్సింది కేసీఆరే అంటున్నారు మంద కృష్ణమాదిగ.  రాజయ్య బర్తరఫ్ తో కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు స్థానంలేకుండా పోయింది. రాజయ్య స్థానంలో కడియం శ్రీహరిని తీసుకున్నా.. ఆయన మాదిగ కులస్తుడు కాదు. ఏకంగా ముఖ్యమంత్రిపదవే ఇస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు మంత్రిపదవి కూడా లేకుండా చేశారంటున్న మందకృష్ణ.. కేసీఆర్ పై మాదిగలంతా దండయాత్ర చేస్తామంటున్నారు. వరంగల్ లో జరిగే.. ఎమ్మార్పీఎస్ సమావేశం తర్వాత.. దండయాత్ర తేదీలు ప్రకటిస్తామన్నారు. రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తున్న రోజుల్లో.. మంత్రివర్గంలో ఒక్క మాదిగకూ స్థానం కల్పించకపోవడాన్ని కేసీఆర్ ఎలా సమర్థించుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: