ఉండవల్లి అరుణ్ కుమార్.. ఇప్పుడంటే ఎప్పుడో ఓసారి మీడియా ముందు కనిపిస్తున్నారు కానీ.. కొన్నాళ్లక్రితం ఉండవల్లి అంటే మీడియాకు హాట్ కేకు. మార్గదర్శి కేసులో ఈనాడు గ్రూపు అధినేతను మూడు చెరువుల నీళ్లు తాగించి ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. లాజిక్కు తీసి మాట్లాడటంలోనూ.. విషయాన్ని స్పష్టంగా చెప్పడంలోనూ ఈయనకు ఈయనే సాటి. ఈనాడు వ్యతిరేకపోరాటం ద్వారా వైఎస్ కు బాగా దగ్గరైన ఈయన.. వైఎస్ మరణం తర్వాత క్రమంగా ప్రాభవం కోల్పోయారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలోనూ.. లాజిక్కులూ, లా పాయింట్లు తీసి మాట్లాడినా.. విభజనతో రాజకీయంగా బాగా దెబ్బతిన్నారు.  ఈ మాజీ ఎంపీ చాన్నాళ్లుకు గురువారం మీడియా ముందుకొచ్చారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ప్రత్యేక హోదా గురించి ఇచ్చిన హామీలను గుర్తు చేసి.. ఇప్పుడు కమలదళం చేతులెత్తేయడం మంచిది కాదని నిలదీశారు. పనిలో పనిగా ఆయన జగన్ భవితవ్యంపైనా కామెంట్ చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో చిక్కులు ఎదుర్కోకతప్పదని అభిప్రాయపడ్డారు. జగన్ ఎన్నికల అఫిడవిట్టే.. ఆయన కొంపముంచబోతోందని కామెంట్ చేశారు. దీని ఆధారంగా జగన్ ను మరోసారి ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.  ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో అనేక చిక్కులు ఎదుర్కొంటున్నారు. జగన్ కేసులో పదికి పైగా చార్జిషీట్లు నమోదయ్యాయి. జగన్ కంపెనీల్లోకి పెట్టుబడుల ప్రవాహం తీరు తెన్నులపై దర్యాప్తు జరిపి.. ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని సీబీఐ తేల్చింది. ఈ కేసులు నెలల తరబడి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా కూడా దర్యాప్తు జరుగుతుందా.. ఇది జగన్ కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతుందా.. అన్నది ఆసక్తికరంగా మారింది. ఐతే.. జగన్ కేసుల దర్యాప్తు.. బీజేపీతో ఆ పార్టీ వ్యవహరించే తీరుపైనా ఆధారపడవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏంజరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: