ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న విధంగా కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక హోదాను కేంద్రప్రభుత్వం నుండి సాధించకపోతే కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం, మద్దతునిస్తున్న వైసిపి చరిత్ర హీనులుగా మిగిలిపోతాయని రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. గురువారం విలేఖరులతో మాట్లాడుతూ విభజన సందర్భంగా ప్రత్యేక హోదాను కల్పిస్తామని అప్పటి ప్రధాని మంత్రి మన్మోహన్‌సింగ్ చెప్పినపుడు, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన బిజెపి నేత వెంకయ్యనాయుడు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసారని గుర్తుచేసారు.

పైగా తాము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని రాజ్యసభలో ప్రకటించారన్నారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వంలో కీలకస్థానంలో ఉన్న వెంకయ్యనాయుడుగానీ, నాడు పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌పై లేనిపోని ప్రేమను ప్రదర్శించిన బిజెపి నాయకులుగానీ ప్రత్యేక హోదా అంశానే్న పక్కనపెట్టారని ఆరోపించారు.

రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ ఎంత కారణమో, అడ్డగోలు పద్ధతిలో పార్లమెంటును నడిపించటంలో మద్దతునిచ్చిన నాటి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బిజెపి కూడా అంతే కారణమన్నారు. విభజనతో నష్టపోయామన్న బాధతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్న ప్రత్యేక హోదా అయినా ఇవ్వకపోతే, ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రజలను మోసం చేసినట్టేనన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ప్రజలు ఎంత ఆవేశంతో కాంగ్రెస్‌కు పరాభవం చేసారో, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అంతే పరాభవాన్ని ఎన్‌డిఏ ప్రభుత్వం చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలుగుదేశం, వైసిపి ఎంపిలు కేంద్రాన్ని నిలదీసి, ప్రత్యేక హోదాను సాధించాలని ఉండవల్లి సలహాఇచ్చారు. కాగా విభజన జరిగిన తీరును సుప్రీం కోర్టు కచ్చితంగా తప్పుపడుతుందనే తాను విశ్వసిస్తున్నానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: