గ్రామీణ ప్రాంత నిరుపేదలకు అవసరమైన వాక్సిన్‌ను ఉత్పత్తి చేసి తక్కువ ధరకు అందించాలనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వాన్ని మందులు కొనుగోలు చేయాలని అభ్యర్థిస్తే అందుకు ఓ కేంద్ర మంత్రి భారీ మొత్తాన్ని ఆశించారని, దాన్ని పూర్తి చేయకపోవడం వల్ల ప్రాజెక్టునే మూసుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని శాంతా బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ వరప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేకెత్తించాయి.

గురువారం తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగిన శాంతా బయోటెక్స్ ఇన్సులిన్ తయారీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసారు. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం పచ్చ తివాచీ పరిచి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తుందని, ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తనీయకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని సిఎం ప్రకటించిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని వరప్రసాద్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసారు.

2007 సంవత్సరంలో ఓ వాక్సిన్‌ను ఉత్పత్తి చేసి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి తక్కువ ధరకు కొనుగోలు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు సరఫరా చేయాలని కోరినట్లు స్పష్టం చేసారు. ఇందుకు ఓ కేంద్ర మంత్రి తమ సంస్థనుంచి భారీ మొత్తంలో డబ్బులు ఆశించారని, అంత మొత్తాన్ని తాము చెల్లించకపోవడం వల్ల దేశ ప్రజలకు విలువైన వాక్సిన్‌ను అందించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసారు. అదే వాక్సిన్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు.

2007 నుంచి 2011 సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగి వేసారిపోయినట్లు ఆరోపించారు. అనంతరం ఆ ప్రాజెక్టును పూర్తిగా విరమించుకున్నామని, పారదర్శకంగా ఉంటామని ముఖ్యమంత్రి పరిశ్రమల స్థాపనకు ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: