తిరుపలి ఎమ్మెల్యే వెంకటరమణ ఇటీవలే మరణించాడు. ఆయన మరణంతో తిరుపతి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. మరి సాధారణంగా ఇలా ఎమ్మెల్యే లు ఎవరైనా చనిపోతే.. వాళ్ల కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు రంగంలోకి దిగడం, వారి ఏకగ్రీవ ఎన్నికకు ఇతర పార్టీలు సహకరించడం జరుగుతుంటుంది. అయితే తిరుపతిలో మాత్రం ఏకగ్రీవ ఎన్నిక జరగడం లేదు.

ఇక్కడ తెలుగుదేశం పార్టీ వెంకటరమణ భార్యను రంగంలోకి దించినా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ వెంకటరమణ భార్య ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినా.. కాంగ్రెస్ మాత్రం అందుకు సమ్మతించలేదు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కాంగ్రెస్ సహకారాన్ని కోరుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది కాబట్టి.. అభ్యర్థిని తప్పించమని కోరుతోంది.

అయితే ఈ విజ్ఞప్తిపై కాంగ్రెస్ పార్టీ చాలా ఘాటుగా స్పందించింది. వెంకటరమణ భార్యను ఎందుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలి? అని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ప్రశ్నిస్తున్నాడు. " వెంకటరమణ ఏమైనా ఉత్తమోత్తముడా.. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఐదొందల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆయన ఏమైనా అల్లూరి సీతారామరాజా, ప్రకాశం పంతులా.. ఆయన భార్యను ఏకగ్రీవంగా ఎమ్మెల్యేను చేయడానికి?'' అని చింతా ప్రశ్నిస్తున్నాడు.

ఏదో మానవతా దృక్పథంతో వెంకటరమణ భార్య ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని తెలుగుదేశం అడిగితే... కాంగ్రెస్ నేత మాత్రం ఘాటుగా స్పందించాడు. చనిపోయిన ఎమ్మెల్యేను అవినీతి పరుడని విమర్శించాడు. ఇదీ ప్రస్తుతానికి తిరుపతి రాజకీయం!

మరింత సమాచారం తెలుసుకోండి: