విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని భారత్‌కు రప్పిస్తానని ప్రగల్భాలు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ ఆచరణలో విఫలమయ్యారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో ఎన్నికల సభలో ప్రసంగిస్తూ పౌర అణు ఒప్పందంలో మోదీ సర్కార్‌ అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయిందన్నారు.

అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన సందర్భంగా మోదీ రూ. 10 లక్షల విలువ చేసే సూట్‌ ధరించారని ఎద్దేవా చేశారు. అమెరికా ఒత్తిళ్లకు మోదీ ప్రభుత్వం లొంగిపోయిందనీ, ఒకవేళ ఏదైనా అణు కర్మాగారంలో ప్రమాదం సంభవిస్తే, అమెరికా కంపెనీలు నష్ట పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉండదని రాహుల్‌ అన్నారు.

‘‘విదేశాలలోని నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఖాతాలో రూ. 15 లక్షల చొప్పున వేస్తానని మోదీ చెప్పారు. మీ ఖాతాలో ఆ డబ్బు పడిందా? మీకేమీ రాలేదుకానీ, ఒబామా పర్యటనలో మోదీ రూ.10 లక్షల సూట్‌ వేసుకున్నారు’’ అని ఆయన విమర్శించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, ‘ఆప్‌’ మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతున్నట్లు వివిధ సంస్థల సర్వేలలో వెల్లడయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: