ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసివాడు నాయకుడు.. అత్తారింటికి దారేది.. చిత్రంలోని ఈ డైలాగ్ అప్పట్లో బాగా పేలింది. ఇప్పడు ఓ ప్రముఖ లీడర్ కూడా ఇదే సూత్రం పాటించాడు. పంతాలు పట్టింపులు మాని.. వేసిన అడుగు వెనక్కి తీసుకున్నాడు. ఆయనే కేసీఆర్.. తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే.. ఫాస్ట్ పథకంపై నానా హడావిడి చేశారు. 1956 నిబంధన అంటూ కొత్త రూల్ తెచ్చారు. అప్పట్లో ఈ పథకంపై చాలా పెద్ద చర్చ జరిగింది.

ఆ తర్వాత ఈ పథకంపై హైకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ఈ దేశంలోనే ఉంది.. ఇది జాతీయ సమగ్రతను దెబ్బ తీస్తుందని కామెంట్ చేసింది. బీహార్, ఒడిశా వంటి పేద రాష్ట్ర్రాల ప్రజలకు హైదరాబాద్ లో చదువుకునే అర్హత లేదా అని ప్రశ్నించింది. ఈ ఫాస్ట్ పథకం రూపకల్పన కోసమే ఫీజు రీఎంబర్స్ మెంట్ కూడా ఆగిపోయింది. ఇంజినీరింగ్ కళాశాలలు.. ఇలాగైతే మేం నడపలేమని చేతులెత్తేశాయి.

సరిగ్గా ఈ సమయంలో.. ఫాస్ట్ పథకంపై కేసీఆర్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఫాస్ట్ పథకమే ఉండదని.. పాత పద్దతిలోనే ఫీజు రీఎంబర్స్ మెంట్ ఉంటుందని స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశంలో దీనిపై కూలంకషంగా చర్చించి ఫైనల్ గా పథకాన్ని ఎత్తేయాలని డిసైడయ్యారు.

కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పేద విద్యార్థుల చదువుకు సంబంధించిన ఈ బోధనం విషయంలో అసలు ఇలాంటి ఆలోచనే తప్పు.. సరే.. తప్పుడు నిర్ణయం తీసుకున్నా.. దాన్ని గుర్తించి వెనక్కు తీసుకోవడం కూడా సాహసంతో కూడిన నిర్ణయమే.. అందుకే అవసరమైన సమయంలో కేసీఆర్ ఓ అడుగు వెనక్కి తగ్గి.. అందరి మెప్పు పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: