హైదరాబాద్.. 400ఏళ్ల ఘన చరిత్ర ఉన్న చారిత్రక నగరం. చారిత్రక నేపథ్యం, నిజాం పరిపాలన, హాయిగొలిపే వాతావరణం వంటి అనుకూలతలకు తోడు.. 1956లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏర్పాటుకావడంతో.. ఈ నగరం తన అభివృద్ధిపథంలో మరింత పరుగందుకుంది. దక్షిణాదిలో ఓ ప్రముఖ నగరంగా పేరు సంపాదించింది. ఇక ఐటీ రాకతో ఆ ప్రగతి కొత్త పుంతలు తొక్కింది. ఐతే.. గత దశాబ్దకాలంగా ఈ ప్రాంతాన్నిఅట్టుడికించిన తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో హైదరాబాద్ భవితవ్యంపై రకరకాల విశ్లేషణలు వెలువడ్డాయి.

ఆంధ్రుల రాకతోనే హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి జరిగిందని.. రాష్ట్రం విడిపోతే.. హైదరాబాద్ ప్రగతి కుంటుపడుతుందని కొందరు విశ్లేషించారు. హైదరాబాద్ మొదటి నుంచి రాజస్థాన్, గుజరాత్, బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల వారిని ఆకర్షించిందని.. కేవలం ఆంధ్రులు వెళ్లిపోయినంత మాత్రన భాగ్యనగరానికి వచ్చిన నష్టమేమీ లేదని మరికొందరు విశ్లేషించారు.

ఇప్పుడు ఏకంగా రాష్ట్రం విడిపోయన నేపథ్యంలో.. హైదరాబాద్ ఫ్యూచర్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఓ అమెరికన్ సంస్థ సర్వేలో హైదరాబాద్ దక్షిణాదిలో చెన్నై తర్వాతి స్థానంలో నిలిచిందని తేలిందట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. దక్షిణాదిలోని ప్రముఖ నగరాల్లో మొదట చెన్నై, తర్వాత బెంగళూరు, ఆ తర్వాత హైదరాబాద్ ఉంటాయి. ఐతే ఈ సంస్థ సర్వే ప్రకారం.. హైదరాబాద్ బెంగళూరును వెనక్కి నెట్టేసిందట.

తలసరి ఆదాయం, ఉద్యోగాల కల్పనలో బెంగళూరు కన్నా హైదరాబాద్ మంచి స్థానం సంపాదించిందట. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 300 నగరాల జాబితాలో.. భాగ్యనగరం 82వ స్థానంలో ఉందట. బెంగళూరు 98వ స్థానంలో ఉందట. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ.. హైదరాబాద్ లో అభివృద్ధి ఆగిపోలేదని చెప్పేందుకు ఈ సర్వే ఫలితాలు ఓ ఉదాహరణ అని తెలంగాణవాదులు సంబరపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: