అమెరికాతో కుదిరిన శాంతి ప్రయోజన అణు సహకార అంగీకారం ధ్రువపడడం అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా మన దేశంలో పర్యటించిన సందర్భంగా సంభవించిన ప్రధాన పరిణామం! అరవై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు అతిథిగా విచ్చేయడం మైత్రీ పూర్వమైన లాంఛనం! కానీ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని రెండవ పెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత సందర్శించడం లాంఛనప్రాయం కాకపోవడం హర్షణీయం! ఈ పర్యటన ఉభయ దేశాల మధ్య వాణిజ్యవంతమైన అణు సహకారాన్ని వ్యవస్థీకరించడానికి మాత్రమే కాక ద్వైపాక్షిక దౌత్యం మరింత పటిష్టం కావడానికి కూడ దోహదం చేసింది! అభూతపూర్వమైన అత్యంత సాన్నిహిత్యం ఉభయ దేశాల మధ్య నెలకొనడానికి ఒబామా పర్యటన ప్రాతిపదికగా మారింది! 2008లో కుదిరిన అణు సహకార అంగీకారం-సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్-ఆచరణకు నోచుకోకుండా ఆరేళ్లుగా కూలబడి ఉండడానికి అమెరికా ప్రభుత్వం ప్రదర్శించిన అతిశయం, అమెరికా వాణిజ్యసంస్థల అక్రమ ప్రయోజన లక్ష్యం ఈ ‘అతిశయం’ ఇప్పుడు అంతరించింది. అక్రమ ప్రయోజన కాంక్షకు పడిన కళ్లెం సడలకుండా స్థిరపడింది! మనదేశంలోకి దిగుమతి అయ్యే ముడి అణు ఇంధన పదార్ధాలు ఎలా వినియోగమవుతున్నదీ పరిశీలించే హక్కు, పర్యవేక్షించే హక్కు తమ దేశానికి ఉండాలన్నది అమెరికా ప్రభుత్వం విధించిన నిబంధన...అణు సహకారంలో భాగంగా తమ దేశంనుండి తరలివచ్చే ముడి ఇంధనం వినియోగాన్ని మాత్రమేకాక, ఇతర దేశాలనుండి మన దేశానికి సరఫరా అయ్యే ముడి ఇంధన ఉపయోగాన్ని కూడా తాము పర్యవేక్షించాలన్నది అమెరికా పట్టుదల! ఈ నిబంధనను ఆమోదించినట్టయితే అమెరికా శాశ్వత ఆధిపత్యానికి మన సార్వభౌమ అధికారం తలవంచినట్టు కాగలదు! అందువల్ల ఆరేళ్లుగా మన ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించాలని కోరుతూ వచ్చింది! సార్వభౌమ దేశాల మధ్య సమానత్వానికి ఇలాంటి నిబంధన భంగకరం! అమెరికాకు గుమతి అవుతున్న ముడి అణు ఇంధన పదార్ధాలు ఎలా ఉపయోగపడుతున్నదీ పర్యవేక్షించే హక్కు మన దేశానికి ఉండాలని మన ప్రభుత్వం కోరితే ఏమవుతుంది? ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలో విజ్ఞత వికసించింది. మన దేశ వ్యవహారాలలో అమెరికా అక్రమ ప్రమేయానికి వీలు కల్పిస్తున్న ఈ విచిత్ర నిబంధనను బరాక్ ఒబామా తొలగించారు. అందువల్లనే కూలబడి ఉండిన ఒప్పందంలో మళ్లీ కదలిక ఏర్పడింది. ఉభయ దేశాలు అంగీకారాన్ని ధ్రువీకరించినట్టయింది...

అమెరికాతో అంగీకారం కుదిరిన తరువాత మనపార్లమెంటు ఆమోదించిన అణు బాధ్యత-న్యూక్లియర్ లయబిలిటీ-చట్టంలోని నిబంధనలను సడలింపచేయడానికి బహుళ జాతీయ వాణిజ్య సంస్థ-మల్టీ నేషనల్ కంపెనీ--ఎమ్‌ఎన్‌సి-లు చేసిన ప్రయత్నాలు ఒప్పందం కూలబడి ఉండడానికి మరో కారణం! అణు ప్రమాదాలు సంభవించినప్పుడు ఆయా అణు కర్మాగార నిర్వాహక సంస్థల బాధ్యత ఎంత? అన్నది ఇన్నాళ్లుగా వివాదాంశమైంది! మన దేశంలో కర్మాగారాన్ని నిర్వహిస్తున్న సంస్థలు ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెల్లించడం సహజ న్యాయ సూత్రాలకు అనుగుణం....కానీ ప్రమాద బాధ్యత నుండి తప్పించుకొనడానికి బహుళ జాతీయ సంస్థలు ఇప్పటికీ యత్నిస్తునే ఉన్నాయి. బహుళ జాతీయ సంస్థలకు, ప్రధానంగా అమెరికా సంస్థలకు అక్రమ ప్రయోజనం కలిగించడానికి వీలుగా మన ప్రభుత్వం ‘బిల్లు’ దశలోనే అనేక మార్పులు చేసింది. ఫలితంగా ప్రమాద బాధితులకు విదేశీయ సంస్థలు చెల్లించే పరిహారంపై గరిష్ఠ పరిమితిని విధించారు. ఆ ‘పరిమితి’కి మించి నష్టం సంభవించినప్పటికీ అణు విద్యుత్ ఉత్పాదక సంస్థలు చెల్లించే పరిహారం మాత్రం పరిమితి కంటే మించదు! మరి ఆ నష్టాన్ని ఎవరు భరించాలి? బాధితులను ఎవరు ఆదుకోవాలి? అన్న ప్రశ్నలకు 2010లో రూపొందిన ఈ చట్టంలో సమాధానాలు లేవు! అయినప్పటికీ పరిమిత బాధ్యత కూడ తమకు లేని రీతిలో చట్టాన్ని సవరించాలన్నది విదేశీయ సంస్థల గొతెమ్మ కోరిక! ఈ సంస్థల ఒత్తడికి లొంగిన అమెరికా ప్రభుత్వం ప రిమిత బాధ్యత నిబంధనను సైతం తొలగించాలని మన ప్రభుత్వంపై ఒత్తడి తేవడం బహిరంగ రహస్యం. ఈ ఒత్తడికి మన ప్రభుత్వం లొంగకపోవడం వల్లనే ఒప్పందం ధ్రువీకరణ కుదరలేదు! ఇప్పుడు ఈ పరిమిత బాధ్యతను స్వీకరింప చేయడానికి అమెరికా ప్రభుత్వం అంగీకరించినట్టయింది. ఎందుకంటే అణు బాధ్యత చట్టం యధాతథంగా కొనసాగుతుందని మన ప్రభు త్వం ఆదివారం ప్రకటించింది!

ఈ విషయంలో లొంగినట్టు కనిపిస్తున్నప్పటికీ నిజానికి అమెరికా ప్రభుత్వం వ్యూహాత్మక విజయాన్ని సాధించింది! ఎందుకంటే ఎంతపెద్ద ప్రమాదం సంభవించినప్పటికీ బాధితులకు విదేశీయ సంస్థలు ప్రధానంగా అమెరికా సంస్థలు చెల్లించే పరిహారం గరిష్ఠ పరిమితికి మించనక్కరలేదు! ఇలా విదేశీయ సంస్థల అణుబాధ్యత పరిమితం చేయడంపై అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ నాయకత్వంలోని ‘ఐక్య ప్రగతి కూటమి’- యుపిఎ- ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయ! అప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతాపార్టీ ఇప్పుడు అధికార పక్షం..అందువల్ల చట్టంలో మార్పులు చేసి అణు విద్యుత్ ఉత్పాదక సంస్థలు ప్రమాద తీవ్రతకు అణుగుణంగా విస్తృత బాధ్యత వహించే నిబంధనను ప్రస్తుత ప్రభుత్వం విధించవచ్చు! అలా విధించకుండా చట్టాన్ని యధాతథంగా కొనసాగించే పరిస్థితిని కల్పించడం ఒబామా విజయం, అమెరికా ప్రభుత్వేతర సంస్థల విజయం, బహుళ జాతీయ సంస్థల విజయం! అపరిమిత బాధ్యతను వహించవలసి రావడం వల్లనే ముప్పయి ఏళ్ల క్రితం భోపాల్ నగర ప్రజలను విషవాయుగ్రస్తం చేసిన అమెరికా వారి యూనియన్ కార్బయిడ్ సంస్థ ఇబ్బందులపాలయిందన్నది విదేశీయ సంస్థల నిర్ధారణ! వేలాది ప్రజల ప్రాణా లు పోయినా ఫరవాలేదు కాని పరిహారం చెల్లించే తమ బాధ్యత మాత్రం పరిమితంగా ఉండాలన్నది ఈ బహుళ జాతీయ సంస్థల వాంఛ! ఆదివారం ధ్రువపడిన ఒప్పందంలో ఈ బహుళ జాతీయ సంస్థల కోర్కె సిద్ధించింది! మనదేశంలో విదేశీయ సంస్థలు నెలకొల్పే అణు విద్యుత్, ఉత్పాదక కేంద్రాలకు ‘పదార్ధ, పరిజ్ఞాన, పరికరాల’ను ఎగుమతి చేసే విదేశీయ సంస్థలను అణు ప్రమాద బాధ్యతనుండి మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వమే విముక్తులను చేసింది! అందువల్ల నాసిరకం ఎగుమతులను చేసిన విదేశీయ సంస్థలకు మన చట్టం ప్రకారం బాధ్యత లేదు!

నిజానికి ప్రమాదాలు ఎప్పుడూ జరగవు! ప్రమాదాలు జరగకపోవడం సహజం..జరగడం అపవాదం! అయినప్పటికీ అమెరికా సంస్థలు భయపడడం సంకుచిత వాణిజ్య ప్రయోజన స్వభావానికి నిదర్శనం! ఇలా ఒప్పందం ధ్రువపడిన తరువాతనైన జాప్యం లేకుండా అమెరికా సంస్థలు మనదేశంలో అణు విద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతాయా? ఉత్పత్తిని పెంచి మన విద్యుత్ కొరతను భర్తీ చేస్తాయా? ఈ ఉత్పత్తి కేంద్రాలకు మన ప్రభుత్వం ఐదేళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్‌లోను, గుజరాత్‌లోను స్థలాలను కేటాయించింది! అమెరికా పర్యవేక్షణలో కాక అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ-ఐఏఇఏ-పర్యవేక్షణలో ఈ ఉత్పత్తి కేంద్రాలు పనిచేయడం మన ప్రభుత్వం సాధించిన విజయం...

మరింత సమాచారం తెలుసుకోండి: