ఢిల్లీ ఎన్నికలు ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి ఆ ఆసక్తి రేగుతుందని చెప్పడానికి లేదు. ఢిల్లీలో పోరు జరుగుతున్న తీరు వల్లనే ఎక్కువ ఆసక్తి జనరేట్ అవుతోంది. ఒకవేళ ఢిల్లీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మధ్య కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ల మధ్య ఎన్నికల పోరు జరిగి ఉంటే... అది అంత ఆసక్తికరం ఉండేది కాదు.

బీజేపీ భారీ మెజారిటీ తో గెలుస్తుందని సరిపెట్టుకోవాల్సి వచ్చేది. అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన పోటీ దారుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రస్తుత సర్వేలను చూసుకొంటే భారతీయ జనతా పార్టీ , ఆప్ ల మధ్య పోరు హోరా హోరీగా జరుగుతోంది.

ఈ పోరు గురించి వస్తున్న సర్వే లు కూడా మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. కొన్ని సర్వేలు అధికారం ఆప్ చేతికి దక్కుతుందని స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 34 నుంచి 39 సీట్లు దక్కే అవకాశం ఉందని తాజాగా సీ ఓటర్ సర్వే అభిప్రాయపడింది. బీజేపీకి 30 నుంచి 34 సీట్ల వరకూ దక్కే అవకాశం ఉందని ఆ సర్వే లో పేర్కొన్నారు.

మరి ఈ సర్వే గనుక నిజం అయితే భారతీయ జనతా పార్టీకి గట్టి షాకే అవుతుందని చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి తిరుగులేకుండాదూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీకి ఆప్ రూపంలో బలమైన ప్రత్యర్థి తయారైనట్టేనని అనుకోవాల్సి వస్తుంది. అయితే ఈ సర్వేనే ఫైనల్ అనుకోలేం.. అసలు తీర్పును యావత్ ఢిల్లీ ప్రజానీకం ఇవ్వాల్సి ఉంది!

మరింత సమాచారం తెలుసుకోండి: