తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సీఎం అయిన తొలిరోజు నుంచీ మీడియా పట్ల అసహనంగానే ఉంటున్నారు. సీఎం అయిన కొద్దిరోజులకే టీవీ, ఏబీఎన్ ఛానళ్లపై అప్రకటిత నిషేధం మొదలైంది. ఆ తర్వాత టీవీ9 దాన్నుంచి బయటపడ్డా.. ఏబీఎన్ మాత్రం ఇంకా తెలంగాణలో ప్రసారానికి నోచుకోవడం లేదు. ఇంత జరిగినా.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మాత్రం..కేసీఆర్ వ్యతిరేకవైఖరి మాత్రం మానలేదు. సాక్షాత్తూ గవర్నర్ కామలీలలపైనే ధైర్యంగా వార్తలు ప్రసారం చేసిన చరిత్ర ఉన్న రాధాకృష్ణ కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు.

కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాసేందుకు తెలంగాణలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా భయపడుతుంటే.. రాధాకృష్ణ మాత్రం తన దారిలోనే ధైర్యంగా సాగుతున్నారు. నిజామాబాద్ ఇసుక కుంభకోణంపై ఆంధ్రజ్యోతి రాసిన కథనం కలకలం సృష్టించింది. మంత్రులు హరీశ్ రావు, పోచారంలకు లంచాలు ముడుతున్నాయని రాశారు.దీనిపై కేబినెట్ భేటీలో మండిపడ్డ కేసీఆర్.. తప్పుడు వార్తలు రాసే పత్రికపై కేసు వేయాలని సూచించారట. దీన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ స్వాగతించారు.

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న జలయజ్ఞం ప్రాజెక్టుల్లో... తెలంగాణలోని కీలక స్థానాల్లో ఉన్నవారు పదిశాతం కమీషన్ గా తీసుకుంటున్నారని తన పత్రికలో రాశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను కాంట్రాక్టర్లను మిస్టర్ 10 పర్సంట్ అని పిలుచుకుంటున్నారని.. ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 2,500 కోట్ల రూపాయల వరకు బిల్లులు చెల్లించారని.. అందులో కాంట్రాక్టర్లు ‘రుసుము’కింద 200 కోట్ల రూపాయల వరకు సమర్పించుకున్నారని రాధాకృష్ణ తన పత్రికలో ఆరోపించారు.

ఈ మొత్తం ఎవరికి చేరుతున్నదో కూడా తమకు తెలుసని... ఆయన ఎవరు? ఏమిటి? అన్నది తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టిన తనపై కూడా కేసీఆర్ కేసు వేయవచ్చని.. వేసినా తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని ఈ వ్యవహారాన్ని రుజువు చేస్తానని సవాల్ విసిరారు. మరి కేసీఆర్ ఆంధ్రజ్యోతిపై కేసు వేస్తారా.. ?

మరింత సమాచారం తెలుసుకోండి: