గణనీయంగా తగ్గిన ముడిచమురు ధరల మూలంగా కేంద్ర ఖజానాకు 45 వేల కోట్ల రూపాయలు మిగిలాయి. పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గుతూ ఉండడంతో ఆ మేరకు సబ్సిడీ భారం కూడా తగ్గుతూ వచ్చింది. ఇదే సమయంలో పలు మార్లు పెట్రోలు, డీజిల్‌ తదితరాలపై ఎకై్సజ్‌ సుంకాలను పెంచడం ద్వారా మరింత ఆదాయం ఖజానాకు చేరింది. వెరసి ఈ మొత్తం 45 వేల కోట్ల రూపాయలైందని ఐసీఆర్‌ఏ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కె రవిచంద్రన్‌ వివరించారు.

పెట్రో సబ్సిడీ తగ్గినందున 30 వేల కోట్ల రూపాయలు మిగులగా, నాలుగు సార్లు ఎకై్సజ్‌ సుంకాలను పెంచడం ద్వారా మరో 15 వేల కోట్ల రూపాయలు వచ్చి చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 5.3 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ భారం కేంద్రంపై పడుతుందని తొలుత అంచనాలు ఉన్నాయి. ఈ మొత్తం ఇప్పుడు 4.85 లక్షలకు తగ్గింది. జూన్‌ 2014లో 115 డాలర్ల వద్ద ఉన్న బ్యారల్‌ క్రూడాయిల్‌ ధర ప్రస్తుతం 45 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంటే సుమారు 55 శాతానికి పైగా తగ్గినట్టు.

గడచిన ఆరు సంవత్సరాల వ్యవధిలో క్రూడాయిల్‌ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ముడిచమురును అధికంగా ఉత్పత్తి చేస్తున్న ఒపెక్‌ దేశాలు ప్రొడక్షన్‌ తగ్గించేందుకు ససేమిరా అనడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. కాగా, గత సంవత్సరం 85 వేల కోట్ల రూపాయలను ఇంధన సబ్సిడీ రూపంలో కేంద్రం భరించగా, ఈ సంవత్సరం అది 30 వేల కోట్ల రూపాయలకు పరిమితమైంది. 2013-14లో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు సబ్సిడీ మొత్తాలను పూడ్చేందుకు 1.39 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం చెల్లించింది.

ఇదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్‌ అమ్మకాలపై వస్తున్న పన్నులు తగ్గడంతో పలు రాష్ట్రప్రభుత్వాలకు ఆదాయ నష్టం జరిగింది. విలువ ఆధారిత పన్ను రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు చేరే ఆదాయానికి గండిపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: