కడప తెలుగుదేశం పార్టీలో వర్గవిబేధాలు భగ్గుమంటున్నాయి. ఓ వర్గానికి పదవి ఇవ్వడంతో మరోవర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా జెండాలు మోస్తున్న తమను నిర్లక్ష్యం చేసి వలస నేతలను ప్రోత్సహిస్తున్నారని తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. ఏన్నో ఏళ్లుగా పార్టీ అభివృద్ధికి పాటు పడుతూ పదేళ్లు అధికారంలో లేకున్నా అక్రమ కేసుల్లో ఇరుక్కున్న వారిని నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు కొనసాగుతున్నాయి. నిజమైన కార్యకర్తలకు న్యాయం జరిగేందుకు పంచాయితీని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని అసంతృప్త తెలుగు తమ్ముళ్లంటున్నారు. కడపజిల్లాలో అంతంత మాత్రంగానే ఉన్న తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలతో పరువు బజారున పడుతోంది.

ఎన్నికల ముందు టిక్కెట్లు దక్కని నేతలు పార్టీ అభ్యర్థి విజయానికి తూట్లు పొడిచారు. దీంతో జిల్లాలో పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఎన్నికల అనంతరం సైతం నియోజకవర్గ ఇన్-ఛార్జ్-ల విషయంలో నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ వచ్చింది. ఇలా ప్రతి విషయంలో తెలుగుతమ్ముళ్ల మధ్య విభేదాలు, అంతర్గత కుమ్ములాటలతో తెలుగుదేశం పార్టీ పరువు పలు నియోజకవర్గాల్లో రోడ్డున పడుతూ వచ్చింది. దీంతో పాటు నామినేటెడ్ పదవుల పంపకం పార్టీ పరువును మరింత దిగజార్చింది. తొలుత జిల్లాలో మార్కెట్ కమిటీ ఛైర్మెన్-ల కోసం పలువురు తెలుగు తమ్ముళ్లు అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అధిష్టానం వీరి వ్యవహారశైలి, పార్టీకి ఎంత వరకు పనిచేశాడన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని పదువులను అప్పగించింది.

మరికొందరు పార్టీలోని పెద్దలతో పైరవీలు చేసి పదవులు సంపాదించుకున్నారు. దీంతో పార్టీలోని తమ వర్గీయులకు పదవులు దక్కని పలువురు నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్-రెడ్డి వర్గీయుడైన గాజుల ఖాదర్ బాషాకు మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పదవి కట్టబెట్టింది. దీంతో మరో మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు వర్గంలో తీవ్ర నిరాశ నెలకొంది. దీంతో ఇరువర్గాల మధ్య అంతర్గతంగా తీవ్ర విభేదాలున్నాయి. తాజాగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ పదవి జిల్లాలోని తెలుగుతమ్ముళ్ల మధ్య చిచ్చు రేపింది. కడప నియోజకర్గానికి చెందిన తెలుగుదేశంపార్టీ నేతలు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్-గా జయచంద్రకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది.

దీంతో కడప నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా తాము పార్టీ జెండా మోస్తున్నా ఇతర పార్టీ నుంచి వలస వచ్చిన జయచంద్రకు ఎలా పదవి కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రెబెల్ అభ్యర్థిగా పోటీచేసి పార్టీ అభ్యర్థి ఓటమికి సహకరించారని వివరించారు. రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన కస్తూరి విశ్వనాధనాయుడు ఆశీస్సులతో కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నేతకు ఎలా పదవి అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. కడప జిల్లా తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలతో పార్టీ పరువు పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. పార్టీకి పెద్ద దిక్కుగా జిల్లాలో ఉంటున్న రాజ్యసభ సభ్యుడు రమేష్ కానీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డి సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఏదేమైనా పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోకపోతే జిల్లాలో పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: