చిరంజీవి పదవీ కాలం ఇంకా చాలానే ఉంది. మొన్నటి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయినా... రాజ్యసభ సభ్యుడు అయిన మెగాస్టార్ కు ఇబ్బంది ఏమీ లేదు. మరో మూడు నాలుగు సంవత్సరాల వరకూ కూడా చిరంజీవి కి ఎంపీ హోదా ఉంటుంది. అయితే మెగాస్టార్ ఈ పదవీ కాలాన్ని కాంగ్రెస్ లోనే పూర్తి చేస్తాడా.. లేక ఇంతలోనే భారతీయ జనతా పార్టీ వైపు వెళ్లిపోతాడా? అనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి.

ఈ అనుమానాలు మొదలై చాలా కాలమే అవుతోంది. అయితే వీటిని బలపరచడాన్ని చిరంజీవే బాధ్యతగా తీసుకొన్నట్టుగా ఉన్నాడు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా.. ఏపీలో, తెలంగాణలో ఎక్కడా అధికారంలో లేకపోయినా.. చిరంజీవి మాత్రం కాంగ్రెస్ తో టచ్ లోనే ఉన్నాడు. మామూలుగా కాదు.. ఏపీ పీసీసీ సమావేశాలకు హాజరయ్యేంతలా పార్టీ కార్యక్రమాల్లో తల మునకలై ఉన్నాడు మెగాస్టార్.

అయితే అదంతా మొన్నటి వరకే.. ఇప్పుడు చిరంజీవి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై అంత ఆసక్తిని ప్రదర్శించడం లేదని తెలుస్తోంది. తాజాగా విజయవాడలో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశానికి చిరంజీవి హాజరయ్యింది లేదు. ఈ నేపథ్యంలో స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

చిరంజీవి వ్యక్తిగత కారణాల చేత ఈ సమావేశానికి రాలేదు.. ఆయనకు అనారోగ్యం అని రఘువీరారెడ్డి చెప్పుకొచ్చాడు. మరి 150 సినిమా కోసం ప్రిపేరవుతున్న చిరంజీవికి అనారోగ్యం ఏమిటి..? అనే అనుమాఆలు కలగడం కూడా చాలా సహజమే. రఘువీరారెడ్డి వివరణను ఎంత వరకూ నమ్మవచ్చో అర్థం కాని పరిస్థితి. మొత్తానికి మెగాస్టార్ మాత్రం కొత్త అనుమానాలే రేకెత్తిస్తున్నాడు. ఆయన నెక్ట్స్ స్టెప్ ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: