రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ఎంత కసరత్తు చేస్తారో.. శత్రువును దెబ్బకొట్టడానికి ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో... తమకు సహకరించని రాజధాని ప్రాంత రైతులను ముప్పుతిప్పలు పెట్టడానికి కూడా ఏపీ ప్రభుత్వం అంతే స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టుగా ఉంది. తూళ్లూరు ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలని ఫిక్సయిన బాబు ప్రభుత్వం ఈ విషయంలో ఎవరి అభ్యంతరాలనూ పట్టించుకోవడం లేదు.

భూమలు ఇవ్వమూ.. అంటున్న రైతుల వాదనను అయితే అస్సలు పట్టించుకోవడం లేదు. కొంతమంది అనుకూల వాదులను రప్పించుకొని.. చూడండి రైతులు భూములు ఇచ్చేయడానికి ఎంత ఆనందంగా ఉన్నారో అని వ్యాఖ్యానం చేసిన ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న రైతులను మాత్రం పట్టించుకోవడం లేదు. అయితే రైతులు కూడా కొంచెం గట్టిగానే ఉన్నారు.

ఈ నేపథ్యంలో తమ అధికారాన్ని ఉపయోగించుకొని రైతులను దెబ్బ కొడుతోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే తూళ్లూరు ప్రాంతంలో వ్యవసాయాన్ని నిషేధిస్తున్నట్టుగా.. వచ్చే సీజన్ నుంచి అక్కడ ఎవరూ పంటలు సాగు చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త వ్యూహాన్ని అమలు పెడుతోంది. ఉత్తర్వులకు రైతులు విలువనివ్వరనే భయంతో ఏకంగా అక్కడ వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలనే అందుబాటులో లేకుండా చేస్తోంది.

ఈ మేరకు క్యాబినెట్ లో నిర్ణయం జరిగిందని.. తూళ్లూరు కు యూరియా వంటి ఎరువుల సరఫరా ఉండదని తెలుస్తోంది. ఈ విషయం అప్పుడే రైతుల వరకూ వెళ్లింది. పంటల కోసం ఎరువులను కొనడానికి వెళ్లిన వారికి అసలు విషయం అర్థం అయ్యింది. దీంతో వారు చేసేదేం లేక మిన్నకుండి పోయారు. మరి రైతులను ఎలా దెబ్బకొట్టాలనే అంశం గురించి చంద్రబాబు ప్రభుత్వానికి బాగానే అవగాహన ఉన్నట్టుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: