రైతు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త అన్నా హజారే నిర్వహించే నిరసన దీక్షకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ హాజరుకానున్నారు. అయితే వీరు హజారేతో వేదికను మాత్రం పంచుకోరు. హజారే రెండు రోజులు నిర్వహించే నిరసన ఆందోళనను సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. కేజ్రీవాల్‌తో తాను ఫోనులో మాట్లాడానని, సోమవారం ఆయన కలిసినప్పుడు భవిష్యత్‌ కార్యాచరణపై మాట్లాడతానని ఆదివారం హజారే తెలిపారు.

''భూ సేకరణ ఆర్డినెన్స్‌ రైతు ప్రయోజనాలను దెబ్బతీసేదిగా ఉంది. వ్యవసాయ ప్రధానమైన దేశంలో రైతులు చిత్రహింసలకు గురవుతుంటే ప్రజలందరూ సంఘటితంగా నిలబడాలి. అందువలన కేజ్రీవాల్‌తో సహా ఏ ప్రతిపక్ష పార్టీనైనా మేం కావాలని కోరుకుంటున్నాం. ఈ ఆందోళనను ముందుకు తీసుకెళ్ళేందుకు కార్యకర్తలు అందరూ కలసికట్టుగా పనిచేయాలి.'' అని హజారే అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆందోళనలో చేరాలన్న కోరికను వ్యక్తం చేశారని హజారే తెలిపారు.

కార్యకర్తలు వేదిక మీదకు రాకూడదని, వారు ఆందోళనలో చేరవచ్చునని కేజ్రీవాల్‌కు తెలిపినట్లు హజారే చెప్పారు. ఆయనతో సోమవారం కలిసి దీనిపై వివరంగా మాట్లాడతానన్నారు. అదే సమయంలో తదుపరి కార్యాచరణపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్‌ కూడా ఆందోళనకు మద్దతివ్వాలనుకుంటున్నదా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు హజారే సమాధానమిస్తూ రాజకీయ పార్టీలు పరిస్థితిని తారుమారు చేసే విధంగా వ్యవహరిస్తాయని హజారే అన్నారు. రాహుల్‌ గాంధీ ఆందోళనలో పాల్గొనవచ్చునని అయితే ప్రజల మధ్యే కూర్చోవలసి ఉంటుందని చెప్పారు.

.........

మరింత సమాచారం తెలుసుకోండి: