ఎట్టకేలకు రంగారెడ్డి- హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌ పట్టభద్ర నియోజకవర్గ స్థానానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ ఖరారు అయ్యారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన జరిగిన పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ భవన్‌ మీడియా ఇన్‌ఛార్జి శ్రావణ్‌ కుమార్‌ రెడ్డి ఆదివారం సాయంత్రం మీడియాకు మొబైల్‌ ద్వారా మెసేజ్‌ పంపించారు. మరో స్థానమైన నల్గొండ- వరంగల్‌-ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర శాసనసభ మండలి పట్టభద్రుల నియోజకవర్గాలైన రంగారెడ్డి- హైదరాబాద్‌- మహబూ బ్‌నగర్‌, నల్గొండ-ఖమ్మం- వరంగల్‌ జిల్లాలకు చెందిన మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, జగదీష్‌ రెడ్డి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్‌ రావు, తలసాని శ్రీనివాసయాదవ్‌, మహేందర్‌ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నాయకుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని, మంత్రులకు, ఇతర ముఖ్య నాయకులకు సీఎం నిర్దేశించారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పై సీఎం దృష్టి కేంద్రీకరించినట్లు, స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులను మార్చి మొదటి వారంలో ప్రకటించవచ్చని సమాచారం. రంగారెడ్డి- హైదరాబాద్‌- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేవీ ప్రసాద్‌ను ఖరారు చేశారు. నల్గొండ- వరంగల్‌-ఖమ్మం ఎమ్మెల్సీ విషయంలో మాత్రం స్పష్టతకు రాలేకపోయారని తెలుస్తోంది. నల్గొండ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరిగిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో పాటు మంత్రి జగదీశ్‌ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంటులో కమీషన్లు తీసుకున్నారంటూ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం, ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ పలు అవినీతి ఆరోపణలు చేశారు. కారణాలు ఏవైనప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ముందుగా అనుకున్న ప్రకారం ప్రకటించలేకపోయింది.

సీఎంతో దేవీ భేటీ.. ఇదిలా ఉంటే, దేవీ ప్రసాద్‌ ఆదివారం రాత్రి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ ఉన్నత స్థాయి సమావేశం రంగారెడ్డి- హైదరాబాద్‌- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజక వర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం విదితమే. టీఆర్‌ఎస్‌ అధికారికంగా ప్రకటించిన తరువాత దేవీ ప్రసాద్‌ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌లోకి టీడీపీ నేత చిన్నపరెడ్డి? మరోవైపు టీడీపీకి చెందిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ అసెంబ్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిన్నపరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి చేరతారని సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లోనే చిన్నపరెడ్డిని టీఆర్‌ఎస్‌లోకి తీసుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలనీ పార్టీ అధిష్టానం అనుకున్నది. కానీ, అప్పటి పరిస్థితుల్లో కుదరలేదు. ఆ ఎన్నికల్లో చిన్నపరెడ్డి పై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి కె.జానారెడ్డి ఓటమి చవి చూశారు. క్యాడర్‌లో మంచి పట్టున్న చిన్నపరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం వల్ల త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి లాభం చేకూరుతుందనే ఆలోచనలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: