బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నమ్మించి గద్దెనెక్కిన చంద్రబాబు తొమ్మిది నెలలు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

గత ఎన్నికల సందర్భంగా టెలివిజన్ ఆన్ చేస్తే చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతాంగానికి చెందిన అన్ని రుణాలు మాఫీ అవుతాయని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారు రుణాలు మాఫీ అవుతాయని ఊదగొట్టించారన్నారు. రాష్ట్రంలో రూ.87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉండగా చంద్రబాబు కేవలం రూ.4,600 కోట్లు మాత్రమే మాఫీ చేసి అన్నదాతలను ఇరకాటంలో పడేశారన్నారు. బంగారం తాకట్టు రుణాలు మాత్రం పైసా కూడా మాఫీ కాలేదన్నారు. చంద్రబాబు హామీతో రైతులు తమ బంగారు నగలకు విముక్తి కలుగుతుందని ఎదురు చూస్తుంటే బ్యాంకుల నుంచి నోటీసులు అందుతున్నాయన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్న చంద్రబాబు, ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఇదే విషయమై అసెంబ్లీలో నిలదీస్తే తానలా హామీ ఇవ్వలేదని బొంకుతున్నారన్నారు. స్వయానా చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలోనే రైతు ఆత్మహత్యలు చోటు చేసుకున్నా చలించడం లేదన్నారు.

రైతు భరోసా యాత్ర పేరిట అనంతపురం జిల్లాలో తాను పర్యటిస్తానని తెలిసిన చంద్రబాబుకు గుండెల్లో గుబులు పుట్టిందన్నారు. గతంలో అనంతపురం జిల్లాలో ఏ రైతు ఆత్మహత్య చేసుకోలేదని చెప్పిన చంద్రబాబు, తన పర్యటనతో 29మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రకటించడమే ఇందుకు నిదర్శమన్నారు. వైఎస్సార్ హయాంలో జరిగిన హంద్రీనీవా పనులను తన హయాంలో పూరె్తైనట్టుగా చెప్పుకుని చంద్రబాబు శాలువాలు కప్పించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గాలేరు, నగరి పథకానికి చంద్రబాబు తొమ్మిదేళ్ల కాలంలో కేవలం రూ.11 కోట్లు కేటాయించగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.4500 కోట్లు వెచ్చించారన్నారు. కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశే్వశ్వర్‌రెడ్డి, అత్తర్ చాంద్‌బాషా, మాజీ ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా వైకాపా అధ్యక్షులు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ తదితరులు పాల్గొన్నారు.

రైతు భరోసా యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన జగన్‌కు అనంతపురం జిల్లా సరిహద్దులో ఆదివారం ఘన స్వాగతం లభించింది. తొలిరోజు యాత్ర కొడికొండ చెక్‌పోస్టు నుంచి హిందూపురం వరకూ సాగింది. ఈ సందర్భంగా లేపాక్షి మండలం మామిడిమాకులపల్లిలో అప్పుల బాధ తాళలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు సిద్దప్ప కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. పంటల సాగుకు చేసిన రుణాలు, వాటిపై పెరిగిన వడ్డీ భారం కావడంతో చివరకు కుటుంబాన్ని కూడా పోషించలేక పోతున్నానన్న వ్యథతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు సిద్దప్ప భార్య రంగమ్మ జగన్ ఎదుట విలపించింది. చలించిన జగన్ వారికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పరిహారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఆయా ప్రాంతాల విద్యార్థులు, రైతులు, మహిళా సంఘాలు, వృద్ధులు, నిరుద్యోగులతో జగన్ మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: