‘అవినీతి అంతం లోక్ సత్తా పంతం’ అంటూ 1996లో లోక్ సత్తా పార్టీని ప్రారంభించిన జయప్రకాష్ నారాయణ్ కాలక్రమంలో మాటల వరకే గానీ తను చేతల మనిషిని కాను అని బయటపడ్డారు. ఉన్నత విద్యావంతులు, మధ్య తరగతి ప్రజలు పార్టీని ఆదరించినా ఆయన తన పార్టీ మీద ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. కులరహిత సమాజం, అవినీతి, నేరమయ రాజకీయాలకు దూరం అంటూనే ఆయన తన కులస్తులు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి నుండి పోటీ చేసి గెలవడం, ఆ తరువాత తెలంగాణ ఉద్యమం సమయంలో వ్యవహరించిన తీరుతో ఆయన కూడా అందరిలా మామూలు రాజకీయ నాయకుడేనని తేలిపోయింది. ఇక ఇటీవల మల్కాజ్ గిరి నుండి పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ తన అభ్యర్థులను నిలబెట్టకుండా తననే బలపరచాలని చివరి వరకు ప్రయత్నించి విఫలమయ్యాడు జేపీ.

ఆయన తన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకుని దానికి వ్యవస్థాపక అధ్యక్షుడుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక కమిటీలు వేసి, జాతీయ అధ్యక్షుడుగా ఇటీవల ముంబయికి చెందిన శ్రీవాస్తవను నియమించాడు. ఆ నామినేటెడ్ కమిటీని గుర్తించమని అన్న పార్టీ సీనియర్ నేతలు కటారి శ్రీనివాస్ రావు, డీవీఎస్ వర్మలను శ్రీవాస్తవ పార్టీ నుండి సస్పెండ్ చేయగా, ఎన్నికలు పెట్టమంటే మమ్మల్నే సస్పెండ్ చేస్తావా అంటూ వారు ఆయనను సస్పెండ్ చేశారు. ఈ లోపు శ్రీవాస్తవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక కమిటీని నియమించడం జరిగింది.

ఈ నేపథ్యంలో పార్టీ నేతల మధ్య తగవు తీర్చాల్సిన జేపీ సీనియర్ నేతలు సంయమనం పాటించడం లేదని, కొత్త రాజకీయాల్ని ప్రోత్సహించేందుకు యువతకు అవకాశం ఇవ్వాలంటూ కొత్త రాగం ఎత్తుకున్నాడు. మరి యువతకు అవకాశం కల్పించాలి అనుకుంటున్నప్పుడు జేపీ పార్టీ నేతలను ఒప్పించి ఎన్నికలు పెట్టి కొత్త వారిని నియమించకుండా తనకు తానే నామినేటెడ్ చేయడం ఎంతవరకు సబబు అన్నది ప్రశ్న.

నియంతృత్వం అంటూ నిత్యం మాట్లాడే జేపీ ఇలా నామినేటెడ్ అధ్యక్షులను నియమించి పార్టీలో తగవు ఎందుకు పెట్టాడు ? అసలు జయప్రకాష్ నారాయణకు, శ్రీవాస్తవకు ఉన్న లింకేంటి ? అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: