అశోక్ బాబు..... సమైక్య ఉద్యమం ముందు వరకూ ఈయనెవరో జనానికి తెలిసేది కాదు.. సమైక్య ఉద్యమ సమయంలో రాత్రికి రాత్రే ఈయన స్టార్ గా మారిపోయారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అశోక్ బాబు..... ఉద్యమ సమయంలో చురుగ్గా వ్యవహరించారు.

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో హైదరాబాద్ నడిబొడ్డున సమైక్య శంఖారావం పేరుతో సభ నిర్వహించి దమ్మున్న నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. రాజకీయ పార్టీలు కూడా హైదరాబాద్ లో సమైక్య స్వరం వినిపించలేని సమయంలో సమైక్య ఉద్యమాన్ని నడిపించి చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు.. సమైక్య పోరాటం ఫలితాన్ని ఇవ్వలేకపోయినా అశోక్ బాబుకు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది.

రాష్ట్రం విడిపోయి... రెండు చోట్ల ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అశోక్ బాబు ప్రాధాన్యం ఆటోమేటిగ్గా తగ్గిపోయింది. ఇటీవల ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉద్యోగుల విషయంలో పోటాపోటీగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణ 43 శాతం ఫిట్ మెంట్ ఇస్తే... ఏపీ కూడా ఇచ్చేసింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ అలాగే జరుగుతుందేమో అనిపిస్తోంది.

తెలంగాణలో టీఆర్ఎస్ ఉద్యోగ సంఘ నేత దేవీప్రసాద్ ను ఎమ్మెల్సీ బరిలో దింపుతోంది. ఇప్పుడు ఏపీలోనూ ఎమ్మెల్సీ రేసులో ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు పేరు వినిపిస్తోంది. కొన్ని ఉద్యోగ సంఘాలు అశోక్‌బాబు పేరును ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించాలని నిర్ణయించాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి ఎమ్మెల్సీ పదవికి అశోక్‌బాబు పేరును పరిశీలించాల్సిందిగా కోరాలని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: