టైటిల్ చూసి.. ఇదేదో చంద్రబాబు తనయుడు లోకేశ్ కు చెందిన వార్తని అనుకోకండి. ఇది ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయిన కార్పొరేట్ కుంభకోణం కేసుకు సంబంధించిన న్యూస్. కాకపోతే ఈ కేసులో నిందితుడి పేరు కూడా లోకేశే.. దాదాపు 10 వేల కోట్ల రూపాయల కుంభకోణంగా చెప్పుకుంటున్న ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు చురుగ్గా సాగుతోంది. ప్రభుత్వంలోని వ్యక్తులే.. ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వరహస్యాలు చేరవేశారన్నది అభియోగం.

ఈ కార్పొరేట్‌ గూఢచర్యం కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. పెట్రోలియంశాఖలో రహస్య పత్రాలను బయటి వ్యక్తులకు చేరవేసిన కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. నేరుగా పెట్రోలియం మంత్రిత్వశాఖకే నిందితుల్ని తీసుకెళ్లి వ్యవహారాన్ని ఎలా నడిపారో ప్రశ్నించారు. శాస్త్రి భవన్‌లో ఉన్న ఈ శాఖ కార్యాలయానికి ఇద్దరు నిందితుల్ని తీసుకెళ్లి వివరాలు రాబట్టారు.

పెట్రోలియం మంత్రిత్వ శాఖలో ప్యూన్‌గా పని చేస్తున్న లోకేశ్‌.. మరియు అతని బృందం ప్రైవేటు ఆయిల్‌ కంపెనీలకు ప్రభుత్వ పత్రాలు అందచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై లోకేశ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. లోకేశ్‌ అతని మిత్రులు ఇంధన రంగంలోకి కొన్ని కంపెనీలకు ప్రభుత్వ పత్రాల సమాచారాన్ని చేరవేశారు. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే ఒక్కో రహస్యాన్ని రేటు కట్టి మరీ అమ్ముకున్నారు.

ఆయిల్ కంపెనీలకు సమాచారం చేరవేసిన వారిలో జూనియర్‌ స్థాయి అధికారి ఒకరున్నట్టు తెలుస్తోంది. అటు సమాచారం అందుకున్న కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లపైనా పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన వారి విచారణ జరుగుతోంది. అక్రమంగా సంపాదించిన సమాచారాన్ని ఎలా వాడుకున్నారనే అంశాలను వారి నుంచే రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు.. ఈ కేసులో ప్రముఖ చమురు సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులను విచారించేందుకు నోటీసులు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: