సార్వత్రిక ఎన్నికలు పూర్తై దాదాపు ఏడాది పూర్తయ్యే సమయానికి దేశ రాజకీయాల్లో కొత్త రకం మార్పులు రానున్నట్టు తెలుస్తోంది. అధికారాన్ని సాధించుకొన్న పార్టీలూ.. ప్రతిపక్షానికే పరిమితం అయిన పార్టీలు కూడా తమ తమ వ్యూహాలను మార్చుకొనున్నాయి. కొన్ని పార్టీలకు అయితే అధినేతలే మారనున్నారని తెలుస్తోంది. ఇలాంటి మార్పుల జాబితాలో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు ఉండటం విశేషం.

తను స్థాపించిన పార్టీ పగ్గాలను వారసత్వం కింద తన తనయుడికి ఇవ్వాలని భావిస్తున్నాడట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏప్రిల్ లో జరిగే సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించవచ్చని తెలుస్తోంది. తన తనయుడు కేటీఆర్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆయన అప్పగించనున్నారట. ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్ లోమంత్రిగా ఉన్న కేటీఆర్ కు పార్టీ అధ్యక్ష పీఠాన్ని అప్పగించున్నారని సమాచారం.

కేసీఆర్ కేవలం ముఖ్యమంత్రి పాత్రకు పరిమితం కాగా.. కేటీఆర్ అటు మంత్రిగా, ఇటు పార్టీ అధ్యక్షుడిగా ద్విపాత్రాభినయం చేసే అవకాశాలున్నాయి. మరి ఇదే జరిగితే హరీష్ రావు ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరమైన అంశం. ఆయనకు కూడా భవిష్యత్తుపై చాలా ఆశలే ఉన్నాయి.

ఇక కాంగ్రెస్ పగ్గాలు కూడా పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ చేతికి రానున్నాయట. దానికి కూడా ఈ వేసవినే ముహూర్తంగా పెట్టుకొన్నట్టు సమాచారం. సోనియాగాంధీ అధ్యక్ష పగ్గాలను రాహుల్ కు అప్పగించి.. పూర్తిగా విశ్రాంతికే పరిమితమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఉపాధ్యక్ష హోదాలో ఉన్న రాహుల్ కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పజెప్పే ప్రక్రియ ఈ ఏప్రిల్ లోనే అధికారికంగా పూర్తయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. మరి ఈ రాజకీయ మార్పులు ఎలాంటి కొత్త పరిణామాలను సృష్టిస్తాయో!

మరింత సమాచారం తెలుసుకోండి: