ప్రత్యేక హోదా, రాష్ట్ర రాజధాని అంశం.. ఇవి రెండూ ఏపీలో కొన్నాళ్లుగా హాట్ టాపిక్స్ గా ఉన్నాయి. విభజన బిల్లు సమయంలో ఇచ్చిన హామీని ఎన్డీఏ కన్వీనియంట్ గా మర్చిపోతోందన్న ఆందోళన ఏపీ జనంలో కనిపిస్తోంది. బాబు - మోడీ జంట అధికారంలోకి వస్తే ఇక నిధుల వరదే పారుతుందని ఊహించిన వారికి వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అటు రాజధాని విషయంలోనూ టీడీపీ సర్కారు అందరినీ కలుపుకుపోకుండా ఒంటెత్తుపోకడ పోతోందన్న విమర్శలూ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ట్విట్టర్లో కామెంట్లు పెట్టిన పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించాడు. ఆయన తొలిసారిగా అటు టీడీపీని, ఇటు బీజేపీని తన కామెంట్లతో ఇరుకునపెట్టాడు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ఇప్పటికే ఆంధ్రాజనం గుండెలు మండుతున్నాయి. ప్రజానాడికి అనుకూలంగా వెళ్లాలన్న ఉద్దేశంతోనే పవన్ బీజేపీపై ఇలా ఘాటు వ్యాఖ్యలతో హెచ్చరించినట్టు కనిపిస్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే చిక్కుల తప్పవన్న సంకేతాలు ఆ కామెంట్లలో అంతర్లీనంగా ఉన్నాయి.

పవన్ ట్వీట్లు టీడీపీ నేతలకూ గట్టి వార్నింగే ఇచ్చాయి. ప్రత్యేకించి రాజధాని అంశంపై పవన్ తొలిసారిగా ట్వీటు విప్పాడు. రాజధాని ప్రాంతంలో బలవంతంగా భూములు లాక్కుంటున్నారంటూ వైసీపీ వంటి పార్టీలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో..ప్రభుత్వం రైతులు కన్నీరు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని, లేదంటే వారి ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని హెచ్చరించారు. కొత్త రాజధాని నిర్మాణంలో రైతులు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత జీవనం ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ సర్కారుపై ఉందని పవన్ గుర్తుచేశారు.

ప్రస్తుతానికి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వెంటనే వచ్చే ఉద్దేశంలేకపోయినా.. కీలకాంశాల పట్ల తన వైఖరిని ప్రకటించడమే పవన్ వ్యాఖ్యల ఉద్దేశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే గాడి తప్పుతున్న బీజేపీ- టీడీపీ పాలనకు తప్పులు దిద్దుకునే అవకాశం ఇవ్వడమే.. కర్తవ్యం గుర్తు చేయడమే ప్రస్తుతానికి పవర్ స్టార్ ఉద్దేశంగా కనిపిస్తోంది. మరోవైపు బడ్జెట్ లో ప్రత్యేకహోదాకు సంబంధించిన ప్రకటన ఉండొచ్చన్న లీక్ అందడం వల్లే పవన్ ఇలా కామెంట్ చేశాడన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: