కొన్నినెలలుగా ఆంధ్రా పోలీసుల కళ్లుగప్పి ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో తలదాచుకుంటున్న ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. మారిషస్ నుంచి శ్రీలంక వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఇంటర్ పోల్ అధికారులకు చిక్కిపోయాడు. కొల్లం గంగిరెడ్డిని జగన్ సన్నిహితుడిగా టీడీపీ వర్గీయులు ఆరోపణలు గుప్పిస్తుంటారు. ఒకటి రెండు వేదికల్లో జగన్ గంగిరెడ్డిని కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ జగన్ కు గంగిరెడ్డి వంటి వారు ఫైనాన్షియర్లంటూ విమర్శలు చేస్తుంటుంది.

కొల్లం గంగిరెడ్డికి ఘనమైన నేర చరిత్రే ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలిపిరిలో జరిగిన హత్యాయత్నంలోనూ కొల్లం గంగిరెడ్డి నిందితుడే. రాయలసీమ జిల్లాల్లోని అనేక జిల్లాల్లో ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. చందనం స్మగ్లింగ్ తో పాటు నకిలీ పాస్ పోర్టులు తయారు చేయడం కూడా గంగిరెడ్డికి అలవాటే. దాదాపు ఏడాది క్రితం నకిలీ పాస్ పోర్టుతో విదేశాలకు పారిపోయాడు.

నకిలీ పాస్ పోర్టు కేసులో హైకోర్టు నుంచి బెయిలు తీసుకుని పరారైన గంగిరెడ్డి దుబాయ్ లో ఉంటున్నట్టు సీఐడీ పోలీసులు గుర్తించారు. అతనిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి.. ఇంటర్ పోల్ సాయం కోరారు. మొత్తానికి వారిసాయంతోనే గంగిరెడ్డిని పట్టుకోగలిగారు. గంగిరెడ్డిని భారత్ తీసుకొచ్చేందుకు సీఐడీ అధికారుల బృందం మారిషస్ బయల్దేరి వెళ్లినట్టు తెలుస్తోంది.

ఇప్పుడు గంగిరెడ్డి అరెస్టు అంశాన్ని కూడా ఏపీలో రాజకీయ పార్టీలు ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకించి టీడీపీ ఈ విషయంలో జగన్ వర్గంపై ఆరోపణలు ఎక్కుపెట్టొచ్చు.. గంగిరెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్ పై కక్ష సాధించే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి గంగిరెడ్డి ఇంటరాగేషన్ లో నోరు విప్పుతాడా.. సంచలన విషయాలు బయటపెడతాడా.. అన్నది చూడాలి. ఈ పరిణామం ఎంతో కొంత వైసీపీని చికాకు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: