నరేంద్రమోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం రోజు సోమవారమే వివాదా స్పద, రైతు వ్యతిరేక భూ సేకరణ ఆర్డినెన్స్‌పై రెండు రోజుల ఆందోళనను హజారే ప్రారంభించారు. వందలాదిమంది హజారే మద్దతుదారులు, నర్మదా బచావో ఉద్యమ కార్యకర్త మేధా పాట్కర్‌ జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. దీనితో పాటు హజారేకు మద్దతుగా దేశంలోని ప్రతి జిల్లాలోనూ హజారేకు మద్దతుగా దీక్షలు, ర్యాలీలు, ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళన వేదిక మీదకు ఆప్‌ లేదా కాంగ్రెస్‌ను అనుమతించబోనని హజారే స్పష్టం చేశారు.

ఆ రెండు పార్టీలు సామాన్యులతో కలిసి ఆందోళనలో పాల్గొనవచ్చని ఆయన సూచిం చారు. 'రైతుల సమ్మతి లేకుండా నీవు భూములు ఎలా లాక్కుంటావ్‌. భారత్‌ వ్యవసాయక దేశం. ప్రభుత్వం కచ్చితంగా రైతుల గురించి ఆలోచించా ల్సిందే. భూ సేకరణ అర్డినెన్స్‌ తీసుకురావడం అప్రజా స్వామికం' అని హజారే ఆగ్రహం వెలిబుచ్చారు. 'రైతు ప్రయోజనాలను ప్రభుత్వం కాలరాయరాదు. ఈ ప్రభుత్వం భారత ప్రజలది. ఇంగ్లాండ్‌, అమెరాకా ప్రజలకు కాదు. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఏర్పాటు చేశారు' అని ఆయన పేర్కొన్నారు. భూ సేకరణ ఆర్డినెన్స్‌ అత్యంత తీవ్రమైన అంశంగా హజారే అభివర్ణించారు. దీనిపై దేశవ్యాప్త ఆందోళన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రైతుల డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెడితే తిరిగి తాను రామ్‌లీలా మైదానానికి వస్తానన్నారు. అక్కడే మళ్లీ నిరనసన కొనసాగిస్తానని చెప్పారు. 'గ్రామీణ ప్రజలకు ఇప్పటికీ ఆర్డినెన్స్‌లోని సవరణల గురించి తెలియదు.

ఆర్డినెన్స్‌లోని నిబంధనల గురించి ప్రతిరాష్ట్రంలోనూ, జిల్లాలోనూ పర్యటించి రైతాంగాన్ని చైతన్యవంతం చేస్తానన్నారు. ఆర్డినెన్స్‌ గురించి ప్రతి జిల్లాకు సమాచారం అందజేయడం అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ఆర్డినెన్స్‌ ద్వారా భూ సేకరణలో పలు మార్పులు తీసుకొచ్చినందుకుగాను మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా నిందించారు. ఈ ఆందోళనలో ఆప్‌, కాంగ్రెస్‌ పాల్గొనే అంశంపై స్పందిస్తూ ఆ రెండు పార్టీలను వేదికపైకి అనుమతించబోనన్నారు. ఒకవేళ తాను అందుకు సుముఖత వ్యక్తం చేస్తే ఇది పార్టీ సభ అవుతుందని హజారే వివరించారు. కాంగ్రెస్‌, ఆప్‌ నాయకులు, కార్యకర్తలు వేదికపైకి కాకుండా ప్రజల్లో కలిసి ఉండవచ్చని సూచించారు. వారిని ఎవరూ ఆపబోరని చెప్పారు. ఆ ఆందోళనలో ఒకప్పటి సహచరులు కేజ్రీవాల్‌, కిరణ్‌బేడీ లేకపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారని అడుగగా 'మేము వారినెందుకు మిస్‌ అవుతాం. మాకు వ్యక్తిగత ప్రయోజనాలు, ఉద్దేశాలు ఏమీ లేవు. వ్యక్తిగత ఆకాంక్షలు, ఉద్దేశాలు ఉంటే అప్పుడు వారిని మిస్‌ అయ్యామన్న భావన ఉంటుంది. ఇవి ప్రజాసమస్యలు' అని హజారే వివరిం చారు. ల్యాండ్‌ ఆర్డినెన్స్‌పై కేంద్రాన్ని నిందిస్తూ తక్షణమే ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భూ సేకరణపై ఆర్డినెన్స్‌ తీసుకుకావడం ద్వారా మోడీ ప్రభుత్వం మొదటిసారిగా రైతాంగం తీవ్ర సమస్యలు ఎదుర్కొనేలా చేసిందని హజారే విమర్శించారు.

రైతులకు ఇప్పటివరకూ ఇలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. 2013 భూసేకరణ చట్టంలో సైతం కనీసం 70శాతం మంది రైతాంగం అనుమతిస్తేనే భూసేకరణ చేయవచ్చని పేర్కొన్నదని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించిందని మండిపడ్డారు. కార్పొరేట్‌ శక్తులకు లబ్ధి చేకూర్చడానికే దీనిని మోడీ ప్రభుత్వం తొలగించిందని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు అచ్చా దిన్‌ అంటూ ప్రజలకు హామీలు గుప్పించారని, నేడు రైతులను బలవంతంగా వారి భూముల నుండి తరిమేస్తున్నారని విమర్శించారు. అచ్చాదిన్‌(మంచిరోజులు) అంటే సామాన్యులకు కాదని, కార్పొరేట్‌ శక్తులకేనని హజారే అన్నారు. మేధాపాట్కర్‌ ప్రసంగిస్తూ మనకు రాలెగావ్‌ సిద్దీ ఆదర్శం కావాలని, గుజరాత్‌ తరహా నమూనా అవసరం లేదని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: