రాజధాని నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. సోమవారం ఆ పార్టీ లేజిస్లేచర్‌ బృందం భూ సమీకరణ జరుగుతున్న గ్రామాలల్లో పర్యటించి, సీఆర్డీఏ కమిషనర్‌కు మొమోరాండం అందజేసింది. మార్చి 7వ తేది లోపు పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రెడ్డి కూడ ఆ గ్రామాలో పర్యటించనున్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ చట్ట విరుద్ధమని, రైతుల భూములు లాక్కుని వ్యాపారం చేస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాజధాని భూ సమీకరణపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణను తీవ్రతరం చేసింది. మార్చి 7 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది మహిళా ఎమ్మెల్యేలతో సహా 38 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంఎల్‌సీలు సోమవారం తుళ్ళూరు, మంగళగిరి మండలాలలో పర్యటించారు.

అనంత రం సీఆర్‌డీఏ కమిషనర్‌ ఎన్‌ శ్రీకాంత్‌ను కలిసి మొమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ రాజధాని ప్రాంత రైతుల గోడు విని అసెంబ్లీలో ప్రస్తావించేందుకే తమ పార్టీ లెజిస్లేచర్‌ బృందం ఇక్కడకు వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రాంతంలో రాజధాని నిర్మించడంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే రాజధాని నిర్మాణ ఫలితాలు అక్కడి రైతులు అనుభవించకుండా ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. 'రాజధాని ప్రయోజనాలు అక్కడి రైతులకు దక్కకుండా బడా ప్రైవేట్‌ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టం ద్వార ప్రయత్నిస్తోందని' ఆయన ఆరోపించారు.

పార్లమెంట్‌లో అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించిన భూ సేకరణ చట్టం-2013 ఉండగా దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. రెవిన్యూ, పోలీస్‌ అధికారులతో రైతులను భయపెట్టి అమలు చేస్తున్న భూ సమీకరణ విధానం చట్ట విరుద్దమన్నారు. రెండవదిగా రాజధాని నిర్మాణానికి రెండు వేల ఎకరాలు అవసరమవుతుందని, ఆ ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన ఏరియాకు మాస్టర్‌ ప్లాన్‌ వేసి విడిచిపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. అప్పుడు రైతులే తమ భూమితో ఎలా ప్రయోజనం పొందాలో నిర్ణయిం చుకుంటారని అన్నారు. 'ప్రజల ఆస్థులతో వ్యాపారం చేయడాన్ని వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒప్పుకునే ప్రసక్తే లేదని' స్పష్టం చేశారు. 'ఇలాంటి ప్రజా వ్యతిరేక పనులను మేం సహించే ప్రసక్తే లేదు.

అధికారులు ఇలాంటి పొరపాట్లు చెయ్యెద్దు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. సీఆర్డీఏ కమిషనర్‌కు ఇదే చెప్పామని' ధర్మాన అన్నారు. 'ప్రజల ఆవేదన వినడానికే ఇక్కడక వచ్చాం. మాతో కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కలిసి ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకెళతామని' ఆయన తెలిపారు. అలాగే లంక గ్రామాలలో వందల సంవత్సరాలుగా భూములు సాగు చేసుకుంటున్న వారిని ఇప్పుడు వెళ్ళగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తామని తెలిపారు. మార్చి నెల 7వ తేదిలోపు వైఎస్‌ జగన్‌ ఆ గ్రామలలో పర్యటిస్తారని తెలిపారు. మాజీ మంత్రి పార్ద సారధి, వివిధ జిల్లాలకు చెందిన ఎమ్యెల్యేలు, ఎంఎల్‌సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: