కాంగ్రెస్‌ యువనేత, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్టీ కార్యకలాపాలకు నాలుగు వారాల సెలవు తీసుకొన్నారు. సార్వత్రిక ఎన్నికల టమి నుండి ఇటీవలి ఢిల్లీ శాసనసభ ఎన్నికల వరకూ కాంగ్రెస్‌ పార్టీ వరుస పరాజయాలను చవిచూసిన నేపధ్యంలో ఆయన అకస్మాత్తుగా “సుదీర్ఘ వారాంతపు సెలవుల’ పేరుతో విదేశాలకు వెళ్లిపోవడం రాజకీయ వర్గాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండడంపై ఆత్మపరిశీలన చేసుకోవడంతో పాటు పార్టీ భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రశాంత వాతావరణంలో, లోతుగా ఆలోచించాలన్న ఉద్దేశంతోనే పార్టీ అధ్యక్షురాలి నుండి కొన్ని వారాల సెలవు కోరారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు పేర్కొంటుండగా కాంగ్రెస్‌ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చే అంశంపై తన తల్లి, అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీతో తలెత్తిన అభిప్రాయబేధాల కారణంగానే అలిగి విదేశాలకు వెళ్లిపోయారనే ప్రచారం కూడా మరికొన్ని వర్గాలలో వినవస్తోంది.

శ్రీమతి సోనియా గాంధీ చుట్టూ చేరిన కొన్ని “కోటరీ’ల తప్పుడు సలహాలు, సూచనల వల్లనే పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతోందని యువనేత విశ్వసిస్తున్నారని, పార్టీ విధానం, రాజకీయ వ్యూహాల ఖరారులో కీలక పాత్ర పోషిస్తున్న పలువురు సీనియర్‌ ఎఐసిసి ప్రధాన కార్యదర్శులకు ఉద్వాసన చెప్పి యువనాయకులలో ఆ స్థానాలను భర్తీ చేయాలన్న వాదనను శ్రీమతి సోనియా గాంధీ త్రోసిపుచ్చడమే రాహుల్‌ గాంధీ ఆగ్రహానికి కారణమని కూడా ఒక టీవీ ఛానల్‌ పేర్కొంది.సోమవారంనాడు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజున ఉభయ సభల సభ్యులనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగించిన సెంట్రల్‌హాల్‌లో గానీ, ఆ తర్వాత విడిగా సమావేశమైన లోక్‌సభలో గానీ రాహుల్‌ గాంధీ కనిపించకపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

రాహుల్‌ గాంధీకి “సెలవు’ మంజూరైన విషయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ కూడా ధృవీకరించారు. పార్టీ ఉపాధ్యక్షునికి వారాంతపు సెలవు మంజూరైందా అన్న ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా “అవును, కొన్ని వారాలు మంజూరు చేశాం, ఆయనకు కొంత సమయం అవసరం అని ఆమె క్లుప్తంగా సమాధానమిచ్చారు. అయితే, పార్టీ వర్గాలు పేర్కొంటున్నట్లుగా ఆయన ఇటీవలి పరిణామాలను లోతుగా సమీక్షించుకొనేందుకు, పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ పంధా గురించి ఆలోచించేందుకే సెలవు తీసుకొన్నారా అన్న మరో ప్రశ్నకు మాత్రం “రాహుల్‌ సెలవుకు కారణం మీకు చెప్పిందే, ఇంతకు మించి నేను చెప్పాల్సిందేమీ లేదు’ అని ఆమె సంభాషణను ముగించారు. రాహుల్‌ గాంధీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నదీ, ఏం చేయబోతున్నదీ అధికారికంగా వెల్లడించని కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు పార్టీ అధ్యక్షురాలితో విభేదాలు తలెత్తాయన్న ప్రచారాన్ని మాత్రం ఖండించింది. అధ్యక్షురాలితో విభేదాల కారణంగానే ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరమౌతున్నారని, క్రియాశీల రాజకీయాల నుండి ఆయన నిష్క్రమణకు సుదీర్ఘ వారాంతపు సెలవులు ఒక సూచన కావచ్చునన్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఎఐసిసి అధికార ప్రతనిధి అభిషేక్‌ సింఘ్వీ తెలియజేశారు. వచ్చే ఏప్రిల్‌లో జరుగనున్న ఎఐసిసి ప్లీనరీ సమావేశాలు కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్‌కు అత్యంత కీలకమైనవంటూ పార్టీ దశ,దిశను నిర్ణయించే ప్లీనరీ సమావేశాల కోసం రాహుల్‌ గాంధీ తీరిగ్గా తన ఆలోచనలకు పదును పెడుతుండవచ్చునని మాజీ ఎంపీ సందీప్‌ దీక్షిత్‌ అభిప్రాయపడ్డారు.

రాహుల్‌ గాంధీ ప్రచారం చేసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోవడానికి రాహుల్‌ సెలవుకు ఎలాంటి సంబంధం ఉందని తాను భావించడం లేదని ఆయన చెప్పారు. సోమవారం నుండి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమౌతున్నందున ఈ సమావేశాలకు హాజరు కాలేని సభ్యులు నిబంధనల ప్రకారం లోక్‌సభ స్పీకర్‌కు దరఖాస్తు చేసి సెలవు తీసుకోవాల్సి ఉంటుందని, అలా సెలవు కోరేందుకు ఆయన ముందుగా పార్టీ అధ్యక్షురాలి అనుమతిని తీసుకొని ఉంటారని అంటూ ఇందులో లేని రాజకీయాలను చూసే ప్రయత్నం చేయవద్దని మరో సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్‌ బిజెపి నేతలకు సలహా ఇచ్చారు. రాహుల్‌ రాజకీయాలకు సెలవు పెట్టడంపై అధికార బిజెపితో పాటు ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన శివసేన, కాంగ్రెస్‌ మిత్రపక్షం-ఎన్‌సిపి నాయకులు మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత దుస్థితికి యువనేత పలాయనం అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. అత్యంత ముఖ్యమైన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు గైరుహాజరు కావడం రాహుల్‌ గాంధీకి రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తిని బహిర్గతం చేస్తోందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ప్రతాప్‌ రూడీ పేర్కొనగా, అధికారంలో ఉన్నప్పటికీ గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు పార్లమెంట్‌కు దూరంగా ఉంటుండడం వల్లనే ఆ పార్టీ లోక్‌సభలో 44స్థానాల కనిష్టస్థాయికి దిగజారిందని బిజెపి యువనేత అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. పార్లమెంట్‌కు హాజరుకాకుండా ఎవరైనా సెలవు తీసుకోవడంలో విశేషమేమీ లేకపోయినా కాంగ్రెస్‌ పార్టీకి దేశ ప్రజానీకం ఇప్పటికే దీర్ఘకాల సెలవు మంజూరు చేశారని మరిచిపోరాదని మరో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావ్డేకర్‌ అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: