తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించి రెండురోజులు గడవక ముందే సోమవారం ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అయితే ఆంక్షలు సచివాలయం మొత్తానికి కాకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి పరిమితం చేశారు. మధ్యాహ్నం ఆంక్షలు అమలుచేసి, సాయంత్రానికల్లా మీడియాపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించడం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు సమచార శాఖ కమిషనర్ ఆర్‌వి చంద్రవదన్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ప్రధాన పౌరసంబంధాల అధికారి (సిపిఆర్‌వో) కార్యాలయంలో ఉన్న మీడియా ప్రతినిధులను పోలీసులు బయటికి పంపించేశారు.

ఒకవైపు మీడియాపై ఆంక్షలు పెట్టలేదని ముఖ్యమంత్రి ప్రకటించగా, మరోవైపు ఆంక్షలు అమల్లోకి రావడం పట్ల మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో, ఎలాంటి ఆంక్షలు విధించలేదని ముఖ్యమంత్రి ముఖ్య పౌర సంబంధాల అధికారి జ్వాల నరసింహారావు ప్రకటించారు. అయితే ఈ క్షణం వరకు మాత్రమే ఆంక్షలు లేవని చెప్పగలనని, తర్వాత విధిస్తే నడుచుకోవడం తప్ప తానేమీ చేయలేనని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. ఇదిలావుండగా, మీడియాపై ఆంక్షలు విధించిన సమయంలోనే ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వచ్చారు. జరిగిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ఆయనకు వివరించారు.

ఏం జరిగిందో తెలుసుకుంటానని ఆయన ముఖ్యమంత్రి వద్దకెళ్లారు. తర్వాత బయటికి వచ్చి మీడియాపై ఎలాంటి ఆంక్షలూ విధించలేదని ప్రకటించారు. సచివాలయం మొత్తానికి కాకుండా ముఖ్యమంత్రి కార్యాలయం వరకు మీడియాను కొంతమేరకు క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందని అల్లం నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో మీడియాపై విధించే ఆంక్షలపై ఇంకా ఎలాంటి నిర్ణయం జరుగలేదని ఆయన స్పష్టం చేశారు. ఆంక్షలు లేనప్పుడు సిపిఆర్‌వో కార్యాలయం నుంచి మీడియా ప్రతినిధులను ఎలా బయటికి పంపించారని మీడియా ప్రతినిధులు ఆయనతో వాదనకు దిగారు. దీంతో ఆయన మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకొని సిపిఆర్‌వో వద్దకు వెళ్లారు.

మీడియాపై ఇప్పటి వరకు ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ఆ తర్వాత విధిస్తే తాను ఏమీ చేయలేనని సిపిఆర్‌వో చేతులు ఎత్తేసారు. మరి మీడియా ప్రతినిధులను బయటికి పంపించమని ఆదేశించింది ఎవరని పోలీసులను ఆరాతీయగా సమాచార కమిషనర్ ఆదేశాల మేరకే నడుచుకున్నామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సమాచార కమిషనర్‌ను ఫోనులో ప్రెస్ అకాడెమీ చైర్మన్ ఆరాతీయగా, తాను ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. ఆంక్షలులేవని అధికారులు స్పష్టం చేసారని, ఆంక్షలు పెట్టిన రోజున తాను మీడియా ప్రతినిధుల వైపు నిలబడి ప్రభుత్వంతో పోరాడుతానని అల్లం నారాయణ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: