ఓవైపు ఆంధ్రా అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతున్నాయి. అందుకే అధికార, ప్రతిపక్షాలు అస్త్రాలకు పదువు పెడుతున్నాయి. రాజధాని అంశంతో పాటు ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షం వైసీపీ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయడానికి సిద్ధమవుతోంది. అందుకు అనువుగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటోంది. రెండు పార్టీల నేతలు ప్రాజెక్టుల బాట పడుతూ పొలిటికల్ హీట్ పెంచేందుకు రెడీ అయ్యారు.

చుక్కనీటి కోసం పడిగాపులు గాసే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే వైసీపీని దెబ్బతీసేందుకు చంద్రబాబు మంచి ప్లానే వేశారు. ఏకంగా వైసీపీ అధినేత సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన రైతులను తనవద్దకు రప్పించుకున్నారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి సమక్షంలో చీనీ, అరటి రైతులు చంద్రబాబును కలిశారు. తన సొంత నియోజకవర్గం కుప్పం కంటే ముందు పులివెందులకే సాగునీరు విడుదల చేస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు.

అంతేకాదు కడప జిల్లాకు ప్రధాన సాగునీటి కాల్వ అయిన గాలేరు నగరి-సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రథమ ప్రాధాన్యంగా పెట్టుకున్నారు. ఈనెల 27న ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే చేయనున్నారు. గండికోట ప్రాజెక్టు కూడా చూస్తారట. చంద్రబాబు దూకుడు గమనించిన వైసీపీ కూడా అందుకు దీటుగానే సమాధానం ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే జిల్లా ప్రాజెక్టులపై ఓ అంచనాకు వచ్చిన జగన్.. నిధుల విడుదల కోసం సర్కారుపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

వైసీపీ శ్రేణులు కూడా సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాయి. గండికోట, సర్వరాయసాగర్, వామికొండ రిజర్వాయర్, గండికోట ఎత్తిపోతల పథకాలకు కృష్ణా జలాలు తీసుకురావాలని సర్కారుపై ఒత్తిడి పెంచాలని డిసైడయ్యాయి. అందుకే అఖిలపక్షం నేతృత్వంలో ఈనెల 26 నుంచి ప్రాజెక్టుల బాట పట్టాలని నిర్ణయించాయి. కడప జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ఒకేరోజు పర్యటన చేస్తుండటంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: