కానిస్టేబుల్ చేతిలో ఉండే కెమెరా... కూడలిలో ఉండే సీసీ కెమెరానే కాదు.. నగరంలో మరో నిఘా వ్యవస్థ పనిచేస్తోందని వాహనదారులు మరవద్దు.. నగర పోలీస్ విభాగంలో అందుబాటులోకి వచ్చిన హాక్ ఐతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కూడా ఈ-చలానాలు జారీ అవుతున్నాయి. నగర కమిషనరేట్ పరిధిలో ప్రారంభించిన ఈ మొబైల్ అప్లికేషన్‌కు ప్రజల నుంచి విశేషాదరణ లభిస్తోంది. సామాన్య ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుండడంతో ఈ అప్లికేషన్ వాడుతున్న వారి సంఖ్య నగరంలో రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఇప్పుడు ట్రాఫిక్ విభాగం పోలీసులకు ఈ అప్లికేషన్ తనవంతు సహకారాన్ని అందిస్తోంది.

నిబంధన ఉల్లంఘించారంటే చలానా పడుతుంది...! నగరంలో పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నోపార్కింగ్‌లో పార్కు చేసిన వాహనాలను తీసికెళ్లడం చేస్తుంటారు. ముఖ్య కూడళ్లలో కెమెరాతో నిల్చొని నిబంధన ఉల్లఘించే వాహనాల ఫొటోలు తీస్తుంటారు. వీరితో పాటు నగరంలో పలు కూడళ్లలో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. సిగ్నల్ జంపింగ్, రాంగ్‌రూట్, ఓవర్‌స్పీడ్ తదితర విషయాలలో సీసీ కెమెరాలు పసిగట్టి వాహనాలను రికార్డు చేస్తాయి. ఆయా వాహనాలకు ఈ చలానాలు జారీ అవుతున్నాయి.

హాక్ ఐతో సామాన్యుడే పోలీస్.. సాధారణ ఫిర్యాదులతో పాటు పోలీసులపై వచ్చే ఫిర్యాదులను నేరుగా సామాన్య ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. సామాన్యుడే ఒక పోలీస్‌గా మారి ట్రాఫిక్ చలానాలు విధిస్తున్నారు. దీనితో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులే కాకుండా సామాన్య ప్రజలు కూడా చలానాలు వేసేందుకు అవకాశమొచ్చింది. నగరంలో ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. నిబంధనలు పాటించకుండా తమనెవరు గుర్తిస్తారనుకుంటే వారి ఇంటికి ఎప్పుడో ఓసారి ఈ-చలానా వచ్చేస్తోంది. వాహనాలు నడిపే వారు జాగ్రత్తగా నడపాల్సిన అవసరముంది.

మనలను ఎవరు చూడడం లేదని రాంగ్‌రూట్, నో పార్కింగ్‌లో వాహనం పార్క్ చేయడం, త్రిబుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ తదితర విషయాలను సాధారణ ప్రజలు గుర్తించి హాక్ ఐ ద్వారా పోలీసులకు సమాచారం ఇస్తే వారికి కూడా ఈ చలానాలు జారీ అవుతున్నాయి. అయితే ఖచ్చితమైన ఆధారాలతో ఫొటోలు పంపించినవాటికే ఈచలానాలు జారీ అవుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై హాక్ ఐలో 280 ఫిర్యాదులు అందాయి. అందులో నిబంధనలు ఉల్లంఘించిన ఆధారాలు సేకరించిన తరువాత 45 వాహనాలకు ఈ-చలానాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: