భూసేకరణ చట్ట సవరణ బిల్లు వ్యవహారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తి కాగానే పాలకపక్షం.. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, రైతుల ప్రయోజనాలను కాపాడతామని తెలిపారు. మా ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, వెన్నంటి వున్నది తామేనని వివరించారు. బిల్లు ఆమోదం కోసం ప్రతిపక్షాల సలహాలను తీసుకోవడానికి తాము వెనుకాడబోమన్నారు. బిల్లుపై వాడి వేడి చర్చ జరుగుతుండగా కాంగ్రెస్, తృణమూల్, ఆప్, ఆర్జేడీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

అటు రాజ్యసభలో మంత్రి ముక్తార్ అబ్బాస్‌నక్వీ భూసేకరణ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, ఈ అంశంపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించి.. దేశంలో ఇప్పటివరకు 636 ఆర్డినెన్స్‌లు వచ్చాయని, అందులో 80శాతం కాంగ్రెస్ పార్టీ జారీ చేసినవేనని గుర్తుచేశారు. ఈ సందర్భంగా సభలో అధికార- విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్డినెన్స్‌ను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌కు లేదని జైట్లీ కుండబద్దలుకొట్టారు.

మరోవైపు పారిశ్రామిక వేత్తలకు లబ్ధి కలిగించేందుకు ఆర్డినెన్స్ జారీ చేశారని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి అన్నారు. ప్రస్తుతం ఆర్డినెన్స్‌ రైతులకు నష్టం కలుగుతుందని, దీనిపై రైతులు ఆగ్రహంగా వున్నారని వెల్లడించారు. గతంలో ఈ బిల్లుపై ఉభయసభల్లో చర్చ జరిగిందని గుర్తుచేశారు. భూసేకరణ ఆర్డినెన్స్ వల్ల రైతులకు ఎంతో నష్టం జరుగుతుందని జేడీయూ నేత శరద్‌యాదవ్ అన్నారు. దేశంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని వ్యాఖ్యానించిన శరద్ యాదవ్.. మెజార్టీ వుందన్న కారణంతో ఇంతకు ముందున్న చట్టాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: