నేను మోనార్క్ ని.. నన్నెవరూ ఆపలేరు.. అనే తరహా తెలంగాణ సీఎం కేసీఆర్ ది. జనం అధికారం చేతికిచ్చారు కదా.. అని మనసులోకి వచ్చిన ప్రతి ఆలోచననూ అమలు చేసేస్తున్నారాయన. దానికి తోడు మిగులు బడ్జెట్ కారణంగా.. చేతిలో మిగులు బడ్జెట్ కూడా ఉండటంతో ఆయన ధోరణికి అడ్డూఅదుపూలేకుండా పోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇబ్బంది లేకపోయినా.. వాస్తు బాగాలేదన్న కారణంతో సెక్రటేరియట్ ను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి అడ్డువస్తుందని మెట్రో రూట్ మార్చేశారు. కులానికో భవనం కట్టిస్తానని హామీలు ఇచ్చేశారు. ఎన్నడూ లేనిది సెక్రటేరియట్లో మీడియాపై ఆంక్షలు పెట్టేశారు. వీటికి కొనసాగింపుగా జనం సొమ్ముతో దేవుళ్లకు మొక్కులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు.

తిరుపతి వెంకన్నకు సాలెగ్రామం హారం చేయించేందుకు 5 కోట్ల రూపాయలు తెలంగాణ ఖజానా నుంచి విడుదల చేశారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి 2 కేజీల బంగారు కిరీటం చేయించేందుకు నిధులు విడుదల చేశారు. కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు చేయించేందుకు 75 వేల రూపాయలు రిలీజ్ చేశారు. పద్మావతి అమ్మవారి ముక్కపుడక కోసం 45వేలు, బెజవాడ కనకదుర్గ అమ్మవారి మొక్కు కోసం 45 వేలు ఖజానా నుంచి విడుదల చేశారు.

జనం అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటే.. ఇలా దేవుళ్ల మొక్కుల కోసం నిధులు విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేసీఆర్ ఈ మొక్కులు మొక్కుకుని ఉంటే వ్యక్తిగతంగా తీర్చుకోవాలి గానీ.. ఇలా సర్కారు సొమ్ముతో మొక్కులు తీర్చుకోవడమేంటన్న విమర్సలు వస్తున్నాయి. కేసీఆర్ కు జనం అధికారం ఇచ్చింది.. తమ బతుకులు మార్చమని కానీ.. ఇలా తమ సొమ్మును ఇష్టారీతిన ఖర్చు చేసేందుకు కాదని కొందరు విసుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: