పాకిస్తాన్ రక్షణ మంత్రి ‘‘రంగ ప్రవేశం’’ చేయడమే అత్యంత నాటకీయమైన పరిణామం. ఇలా రంగప్రవేశం చేయడం ద్వారా గతంలో తాను అబద్ధం చెప్పినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ధ్రువీకరించింది సాయుధ జిహాదీ హంతకులు మనదేశంవైపు నడిపించిన ఆ మరపడవ తమది కాదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు పడవ పాకిస్తాన్ వారిదేనన్న వాస్తవం మరోసారి ధ్రువపడింది. గత ఏడాది డిశంబర్ 31వ తేదీన గుజరాత్ సముద్రతీరం వైపునకు దూసుకొని వచ్చిన ఈ బీభత్స వాహనాన్ని మన తీర భద్రతాదళంవారు-కోస్ట్‌గార్డ్-వారు అడ్డుగొనడంతో మొదలైన పాకిస్తాన్ అబద్ధాల కథలోని ఉత్కంఠ ఇలా విడిపోయింది. ఆ పడవ తమది కాదని తమదేశపు తీరం నుండి అది బయలుదేరలేదని పాకిస్తాన్ ప్రభుత్వం అప్పుడు బుకాయించింది. మన సముద్ర తీర భద్రతాదళం వారు పాకిస్తాన్ నుండి మన దేశంవైపునకు దూసుకొని వచ్చిన ఆ పడవను అడ్డుకున్నారు. తామెవ్వరో తెలియజేయాలని హెచ్చరించిన మన భద్రతాదళం వారి హెచ్చరికను ఖాతరు చేయకుండా మన సార్వభౌమ జలాలనుండి పారిపోవడానికి సాయుధులు యత్నించారు. ఆ తరువాత ఆ పడవ పేలిపోయింది. ఆ పడవ వెంట మరో పడవ కూడ వచ్చిందని అది తప్పించుకొని పోయిందని అప్పుడు ప్రచారం అయింది. మొత్తం మూడు పడవలు మన తీరం చేరడానికి యత్నించాయని మొదటి పడవ పేలిపోవడంతో మిగిలిన రెండు పడవలూ ఉడాయించాయన్న అనుమానాలు కూడ గతనెల ఆరంభంలో వ్యక్తమయ్యాయి. పోయిన పడవనిండా ఆయుధాలు, బాంబులు ఇతర పేలు డు పదార్థాలు ఉన్నట్టు స్పష్టమైంది. అందువల్ల ఈ పడవ వెంట వచ్చిన మరో పడవలోను లేదా రెండు పడవలలోను ఆయుధాలు, విస్ఫోటక సామగ్రి ఉందన్నది స్పష్టం. ఏమయినప్పటికీ పేలిపోయిన పడవ తమది కాదని హతులైన సాయుధులు తమ పౌరులు కాదని పాక్ ప్రభుత్వం అప్పుడు చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు భారత సముద్ర భద్రతా దళం వారు పడవను పేల్చేశారని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసీఫ్ రాద్ధాంతం చేస్తున్నాడు. పడవ తమది కానప్పుడు జనవరిలో చెప్పిన మాట వాస్తవమైనప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రమేయం ఎందుకు? ‘అంతర్జాతీయ జలాల్లో పయనిస్తుండిన ఆ పడవను భారత దళాలు పేల్చివేశాయని పడవలోని నలుగురు అమాయకులను బలిగొన్నారని పాకిస్తాన్ రక్షణ మంత్రి బుధవారం ఆరోపించారు. ఇలా అంతర్జాతీయ జలాలలోని పడవను పేల్చివేయడం ద్వారా భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయనిబంధనలను ఉల్లంఘించినట్టు చిత్రీకరించడం వాస్తవానికి పాకిస్తాన్ చేసిన మరో వక్రీకరణ...

రక్షణమంత్రిత్వశాఖ వారు జనవరి 2వ తేదీన చెప్పినదాన్ని ఇప్పుడు కూడ పునరుద్ఘాటించారు. పాకిస్తానీ పడవలోని వారు పట్టుబడడం ఇష్టంలేక తమ పడవను పేల్చివేశారన్నది రక్షణ మంత్రిత్వశాఖ వారు అప్పుడే చెప్పిన మాట. రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ బుధవారం కూడ ఇదే చెప్పాడు. మాట మార్చిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ లోషాలి తప్పిదం చేశాడని, క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించాడని మంత్రి నిర్ధారించారు. ఈ మొత్తం వ్యవహారంలో ‘ఇది ప్రధాన అంశం కాదు. ఉన్నత అధికారి ఒకరు మాట మార్చడం’’ ద్వారా ప్రభుత్వానికి దేశానికి అప్రతిష్ఠ తెస్తున్నట్టయితే అతగాడిపై సేవా నియమావళికి అనుగుణంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. లోషాలిపై అలాంటి చర్యను ప్రభుత్వం ప్రారంభించిందట కూడ. అయితే తన మాటలను మాధ్యమాల వారు వక్రీకరించినట్టు కూడ లోషాలి చెబుతున్నాడు. ఇదంతా లోషాలీకి ప్రభుత్వానికి మధ్య తేలవలసిన సేవా నియమావళి వ్యవహారం. కానీ ఈ మొత్తం వ్యవహారంలో నిర్ధారణ కావలసిన ప్రధాన అంశం టెర్రరిస్టులతో భద్రతాదళాలు ఎలా వ్యవహరించాలన్నది మాత్రమే. పడవలో గుజరాత్ తీరానికి సమీపంగా వచ్చినవారు మన సార్వభౌమ జలాలలోకి ప్రవేశించారు. వారు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ఉగ్రవాదులన్నది కూడ నిర్ధారణ జరిగిన అంశం. అలాంటప్పుడు భద్రతాదళాల హెచ్చరికను పాటించి వారు లొంగిపోయి ఉండాలి. లొంగిపోలేదు. అందువల్ల పాకిస్తానీ పడవను తరిమి పట్టుకొనడం మినహా భద్రతా దళానికి మార్గాంతరం లేదు. బలప్రయోగం జరగకుండా బీభత్స శకటాన్ని పట్టుకోవడం అసాధ్యం. అందువల్ల మన దళాలవారు కాల్పులు జరిపి ఉంటే తప్పేంటి? ఈ కాల్పుల ఫలితంగా పడవ పేలిపోయి ఉండినప్పటికీ అది మన సముద్ర తీర గస్తీ దళం వారి తప్పిదమెలా అవుతుంది? పైగా పడవ మన సముద్ర జలాలలో ఉంది.

అర్థరాత్రి జరిగిన యుద్ధంలో పడవ పేలిపోవడానికి ఎన్నో కారణాలు ఉండి ఉండవచ్చు. పట్టుబడితే విచారణలో పాకిస్తాన్ ప్రభుత్వం వారి విస్తృత బీభత్స వ్యూహంలోని వివరాలు ప్రపంచానికి వెల్లడి కాగలవు. అందువల్ల పాకిస్తాన్ సైనిక దళాల ప్రతినిధులతో ప్రసంగించిన తరువాత వారి సలహాపై పడవలోని వారు ఆత్మాహుతికి పాల్పడి ఉండవచ్చు. పడవలోని వారు పడవ పేలిపోక పూర్వం పాకిస్తాన్ సైనిక అధికారులతో మాట్లాడినట్టు జనవరిలోనే ధ్రువపడిన వైనం. పడవలోని వారు పాకిస్తాన్ సైనికులైనా అయివుండాలి లేదా పాకిస్తాన్ వారి ఐఎస్‌ఐతో సంబంధాలున్న జిహాదీ హంతకులైనా ఉండాలి. పడవలో ఈ రెండు తెగలకు చెందని అమాయకులు ఉండి ఉన్నట్టయితే పాకిస్తాన్ సైనికాధికారులతో వారు ఫోన్‌లలో ఎట్లా మాట్లాడగలరు? పడవ మన గస్తీ దళానికి దొరికిపోవడం ఇష్టంలేని మిగిలిన రెండు పడవలలోని వారైనా ఈ పడవను పేల్చివేసి తమ పడవలలో పారిపోయి ఉండవచ్చు. ఇవీ ఈ వ్యవహారంలో ప్రధానమైన అంశాలు. అప్పుడు పేలిన పడవ తమది కాదని బుకాయించిన పాకిస్తానీ ప్రభుత్వ ప్రతినిధులు పడవలోని వారితో తమ సైనిక ప్రతినిధులు ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో మాత్రం చెప్పలేదు. ఇప్పుడు అంతర్జాతీయ జలాలలోని పడవను మన గస్తీదళం వారు పేల్చినట్టు పాకిస్తాన్ ఆరోపిస్తోంది. పడవ తమది కాకపోతే అంతర్జాతీయ జలాలలో పేలిన పడవ సంగతి తమకెందుకు? నిజానికి పడవ పేలింది మన సార్వభౌమ జలాలలో...

మన సార్వభౌమ జలాలలోకి దూసుకువచ్చిన తరువాత పడవను మన సముద్ర తీర భద్రతాదళం వారు పసికట్టి నిలదీశారు. తరువాత పడవ పేలిపోయింది. పడవలోని వారు పట్టుబడడం ఇష్టం లేక ఆత్మాహుతికి పాల్పడ్డారు. అయితే ఈ పడవలోని వారు ఆత్మాహుతికి పాల్పడలేదని, ఈ పడవను పేల్చివేయవలసిందిగా తాను తమ దళాలను ఆదేశించానని తీర భద్రతా విభాగానికి చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ బికె లోషాలి ఇప్పుడు చెప్పాడట. ‘‘ఆ పాకిస్తానీ పడవను మేమే పేల్చివేశామని డిసెంబర్ 31వ తేదీ రాత్రి పడవ పేలిపోయినప్పుడు నేను గాంధీనగర్‌లో ఉన్నాను’’ అని బి.కె.లోషాలి ఇప్పుడు ప్రకటించాడట. బీభత్సకారులను కాల్చిపారేయడం తప్పుకాదన్నది లోషాలి చెప్పిన మాటల సారాంశం. ‘వారికి-పాకిస్తానీ ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించడం మాకు ఇష్టం లేదు..’’ అని కూడ ఆయన అన్నాడట. లోషాలి ఇలా ప్రకటన చేసిన ఘట్టాన్ని చిత్రీకరించినవారు దాన్ని దృశ్యమాధ్యమాలపై ఆవిష్కరించడం ఇప్పుడు వివాదాంశమైంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి జరిగిన ఘటన గురించి జనవరి రెండవ తేదీన అధికారికంగా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: