ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోంటుందంటూ స్వచ్ఛందంగా రైతులు ఉద్యమిస్తుండడంతో వారికి అన్ని విధాలా సహకరించడంలో ప్రతిపక్షాలు స్పీడ్ పెంచాయి. రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలోని జరీబు రైతుల్లో కొందరు ప్రభుత్వం నుంచి అదనపు ప్యాకేజీ హామీ వస్తుందని ఎదురుచూడగా, భూములను నమ్ముకున్నాం గనుక అమ్ముకునేది లేదంటూ మరికొందరు ఉద్యమించే దిశగా ఏకమవుతున్నారు.

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) పరిధిలోని 29 గ్రామాల్లో భూ సమీకరణ ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనసాగనుంది, ఇప్పటివరకు 24 వేల ఎకరాల్లో ప్రభుత్వం సమీకరించింది. మరో నాలుగు రోజుల్లో 10 వేల ఎకరాలను సమీకరించడం కష్టసాధ్యంగా కనిపిస్తోంది. తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, మంగళగిరి మండలంలోని నిడమర్రు, కురగల్లు రైతులు భూములను వదులుకోబోమంటూ తెగేసి చెప్తున్నారు.

ఈ దశలోనే కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మరికొందరు రాజకీయ నాయకుల అండదండల కోసం ఆహర్నిశలూ ప్రయత్నిస్తున్నారు. వైకాపా 40 మంది ప్రజాప్రతినిధులు సోమవారం మూడు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. రైతులు భయాందోళనకు గురై ప్రభుత్వానికి భూములిస్తున్నట్లుగా గుర్తించారు. కృష్ణానది కరకట్ట ఆక్రమణ వ్యవహారంలో వామపక్షాలు చేపట్టిన ఉద్యమంతో ప్రభుత్వం దిగివచ్చింది. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఈ ప్రాంతంలో పర్యటించింది.

సామాజిక కార్యకర్త అన్నాహజారే సోమవారం నుంచి ప్రారంభించిన శిబిరం వద్దకు మంగళవారం రాజధాని ప్రాంత రైతులు వెళ్లారు. వైసిపి నేత అంబటి రాంబాబు నాయకత్వంలో కొందరు రైతులు అన్నాహజారేను కలవటమే కాకుండా ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటుచేశారు. రైతుల ఉద్యమాలకు బాసటగా నిలిచేందుకు సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ కూడా అంగీకరించడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా వెలుగుచూసే అవకాశముంది. పార్లమెంటు సభ్యుల దృష్టిని కూడా ఆకర్షించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: