కేంద్రం ప్రకటించిన 14వ ఆర్ధిక సంఘం నిధులపై రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తిగా ఉంది. ఐదేళ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు 1.69 లక్షల కోట్ల రూపాయలను ఇవ్వాలని నిర్ణయించింది. ఇది గతం కన్నా భారీ మొత్తం కావడం విశేషం. ఇదే సమయంలో కేంద్ర ప్రాయోజిత నిధుల రాకపై మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. నాలుగు రోజుల్లో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ అనంతరం దీనికి సమాధానం లభిస్తుందని ఆర్ధిక శాఖ అధికారులు అంటున్నారు.14వ ఆర్ధిక సంఘం ప్రకటించిన 1.69 లక్షల కోట్ల రూపాయలకు అదనంగా రెవెన్యూ లోటు భర్తీకోసం మరో 22,113 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గతం నుంచీ కోరుతున్న విధంగా ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని స్వల్పంగా పెంచాలని ఆర్ధిక సంఘం నిర్ణయించింది. ప్రస్తుతం మూడు శాతంగా ఉన్న పరిమితిని 3.25 శాతానికి పెంచారు. ఇది కొంత ఊరట కలిగించేదిగానే భావించవచ్చు.

రాష్ట్రానికి కేటాయించిన 1.69 లక్షల కోట్లలో 2015-16 తొలి ప్రణాళికా సంవత్సరానికి 24,938 కోట్లు రానుంది. అలాగే వరుసగా ఆ తరువాత నాలుగేళ్లకు 28,776, 33,248, 38,462, 44,546 కోట్లు చొప్పున రాష్ట్రానికి రానుంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామీణ సంస్థలకు 8650 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు 3630 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్‌కోసం 2429 కోట్లు ఇస్తుండగా, తెలంగాణకు 1363 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అంతా కలిపి తొలి ఏడాదే 31,547 కోట్లు రాష్ట్రానికి రానుంది.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 13వ ఆర్ధిక సంఘం ద్వారా 1.14 లక్షల కోట్లు రాగా ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే 1.69 లక్షల కోట్లు కేటాయింపులు జరగడం గమనార్హం. 13వ ప్రణాళికా కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 4.07 శాతంగా, తెలంగాణ ప్రాంతానికి 2.86 శాతంగా లెక్కించారు. ఇప్పుడు మొత్తం కేంద్ర నిధుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 4.305 శాతం, తెలంగాణకు 2.437 శాతం కేటాయింపులు జరిగాయి. ఈ కేటాయింపులకు 17.5 శాతం జనాభా ప్రాతిపదికగా, పది శాతం జనాభా పెరుగుదల మార్పు, 50 శాతం ఆదాయం, 15 శాతం భౌగోళిక ప్రాంతం, 7.5 శాతం అటవీ ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకుని కేటాయింపులు నిర్వహించారు. ఇలా ఉండగా, రెవెన్యూ లోటు నిధులు కూడా బాగానే కేటాయింపులు జరిగాయి. దేశ వ్యాప్తంగా 11 రాష్టాల్లో రెవెన్యూ లోటు ఉన్నట్లు ఆర్ధిక సంఘం గుర్తించింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు స్థానం కల్పించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు మిగులు, ఆంధ్రకు లోటు ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే లోటు నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రానికి మొత్తం 22113 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా, తొలి ఏడాది 6609 కోట్లు రానుంది. మిగిలిన నాలుగు సంవత్సరాలు వరుసగా 4930, 4430, 3644, 2499 కోట్లు ఇవ్వాలని ఆర్ధిక సంఘం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే జమ్ము కాశ్మీర్‌కు అత్యధికంగా 59,666 కోట్లు కేటాయింపులు జరుగగా, హిమాచల్‌ప్రదేశ్ 40,625 కోట్లతో రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి.

ఇలా ఉండగా, తాజా ఆర్ధిక సంఘం కేటాయింపుల్లో అనేక గ్రాంట్లను తొలగించారు. 32 శాతం నుంచి 42 శాతానికి మొత్తం కేటాయింపులు పెంచడం వల్ల గ్రాంట్ల తొలగింపు జరిగిందని అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో కేంద్రం నేరుగా రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర ప్రాయోజిత నిధులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధుల్లో భారీగా కోతలు పడే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. 28వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో కోతలు ఎంతవరకు ఉంటాయన్నది తేలుతుందని అంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో భారీగా రాష్ట్రానికి నిధులు ఇవ్వాల్సి ఉంటున్నందున కేంద్ర ప్రయోజిత నిధుల్లో కోతలకు కేంద్రం ప్రయత్నించే అవకాశాలు ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: