ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ మొండి అయితే కేసీఆర్ జగమొండి.. ఇద్దరూ ఇద్దరే.. అందుకే ఎవరూ ఎవరికీ బెదరకుండా ఎవరి పంథాలో వాళ్లు వెళ్తున్నారు. కేసీఆర్ వ్యవహారశైలి తెలిసినవారు కావడంతో.. తెలంగాణ మీడియా అధినేతలు కూడా ప్రస్తుతం తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు రాసే సాహసం చేయడం లేదు.

తెలంగాణలో ఒక్క రాధాకృష్ణ మాత్రమే వీలుచిక్కినప్పుడల్లా కేసీఆర్ పై విమర్శలు గుప్పించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. తెలంగాణ సీఎం సొంత పత్రిక నమస్తే తెలంగాణలో కేసీఆర్ ను మహాత్ముడిగా వర్ణిస్తూ ఓ కథనం ప్రచురించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ కథనం రాశారు. ఈ కథనంలో కేసీఆర్ ను మహాత్మాగాంధీ, మార్టిన్‌ లూథర్‌కింగ్‌, దలైలామాలతో పోల్చారు.

దీన్ని ఆంధ్రజ్యోతి ఎండీ తన సంపాదకీయంగా విమర్శించారు. సొంత మీడియాతో తన ఇష్టం వచ్చినట్టు రాయించుకుంటున్నారని కడిగేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ, అమెరికాలో నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడిన మార్టిన్‌ లూథర్‌కింగ్‌, దలైలామా.. వీరంతా అధికారాని దూరంగా ఉంటే.. కేసీఆర్ మాత్రం అధికారం కోసం అర్రులుచాచాడని రాధాకృష్ణ తన సంపాదకీయంలో విమర్శించారు. దళితుడే తొలి ముఖ్యమంత్రి అని బహిరంగంగా ప్రకటించి.. మాట తప్పిన కేసీఆర్‌ ఎలా మహాత్ముడవుతాడని ఏకిపారేశారు.

రాధాకృష్ణ ఆరోపణలతో డిఫెన్సులో పడ్డా సీఎం సొంతపత్రిక.. తనను తాను సమర్థించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అహింసాయుతంగా పోరాడి.. తెలంగాణ సాధించిన కేసీఆర్ ను మహాత్ముడని కీర్తించడంలో తప్పేముందని ప్రశ్నించింది. పనిలోపనిగా రాధాకృష్ణ వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించింది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన పాదయాత్రను మహాత్ముడి దండి పాదయాత్రతో పోలుస్తూ రాధాకృష్ణ ఛానల్ ఏబీఎన్ లో ప్రసారమైన కథనాలను ప్రస్తావించింది. అధికారం కోసం పాదయాత్ర చేసిన బాబును.. రాధాకృష్ణ మహాత్ముడితో పోలిస్తే తప్పులేనప్పుడు... కేసీఆర్ ను మహాత్ముడిగా వర్ణించడం ఏమాత్రం తప్పుకాదని సమర్థించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: