అవినీతిని ఏమాత్రం సహించేది లేదంటూ కేసీఆర్ ఏకంగా తన ఉపముఖ్యమంత్రినే బర్తరఫ్ చేయించారు. అవినీతిపై సమరానికి ఇదే తన నిబద్దత అని అప్పట్లో ప్రకటించారు. పదవి నుంచి తొలగించినా.. రాజయ్య పార్టీ వీడకుండా జాగ్రత్తపడ్డారు. మనసులో ఎన్ని తిట్టుకున్నా రాజయ్య కూడా కాంప్రమైజ్ అయ్యారు. పార్టీలోనే ఉంటానని ప్రకటించారు.

ఇప్పుడు తెలంగాణ సర్కారును మరో స్కామ్ వెంటాడుతోంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధుల మంజూరులో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నఆరోపణలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ విషయంపై గట్టిగా పోరాడుతున్నారు. వరుస ప్రెస్ మీట్లతో దాడి తీవ్రం చేశారు.

పొన్నం ప్రభాకర్ ఊరికే ఆరోపణలు చేసి వదిలేయకుండా.. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. గతంలో విద్యాశాఖమంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి.. ఫీజు రీఎంబర్స్ మెంటు నిధుల్లో 5 శాతం కమీషన్లు తీసుకున్నారని గట్టిగా వాదిస్తున్నారు. మంత్రి అవినీతికి పాల్పడకపోతే.. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసురుతున్నారు. ముఖ్యమంత్రి దీనిపై విచారణకు కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఐతే.. ఈ అవినీతిపై తెలంగాణ సర్కారు పెద్దగా స్పందించడం లేదు. అవినీతి ఆరోపణలపై రాజయ్యను యుద్ధ ప్రాతిపదికపై తొలగించిన కేసీఆర్.. జగదీశ్వర్ రెడ్డి విషయంలో మాత్రం స్పందించకపోవడం రాజకీయ విమర్శలకు తావిస్తోంది. కేసీఆర్ రాజయ్యను టార్గెట్ చేసి తొలగించారన్నఆనాటి ఆరోపణలకు ఈ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. జగదీశ్వర్ రెడ్డితో కేసీఆర్ కు ఉన్న సత్సబంధాల కారణంగానే ఆయన్ను కొనసాగిస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది. మరి కేసీఆర్ ఈ పరీక్షను ఎలా ఎదుర్కొంటారో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: