రాజకీయ నేతల్లో అభిమానం ఒక్కసారి అతి అవుతుంటుంది. ఇది ఆయా నేతలను నవ్వుల పాల్జేస్తుంటుంది. భజనలో మునిగి తేలే నేతలు చేసే భజన చూసే వారికి విడ్డూరమనిపిస్తూ ఉంటుంది. నవ్వు తెప్పిస్తుంటుంది. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీరు కూడా ఇలాగే ఉంది. ఈయన చెన్నైలో చేసిన వ్యాఖ్యానాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి.

నారా వారి మూడో తరం నాయకత్వంలో కూడా తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని.. కలిసికట్టుగా కష్టపడి ముందుకు సాగుతామని సోమిరెడ్డి సెలవిచ్చాడు. మరి నారా వారి మూడో తరం ఏమిటి? అనే సందేహం వస్తుందెవరికైనా. అంటే.. నారా లోకేష్ కు పుట్టబోయే బిడ్డలనమాట! వారి నాయకత్వంలో కూడా పనిచేయడానికి సోమిరెడ్డి వారు సంసిద్ధంగా ఉన్నారట!

మరి ఆలూ లేదూ చూలూ లేదు.. కొడుకుపేరు సోమలింగం అనే సామెతకు సోమిరెడ్డి మాటలు వంద శాతం సూటవుతాయేమో! నారా లోకేష్ ఫ్యామిలీ ప్లానింగ్ ఏమిటో కూడా ఇప్పటి వరకూ ఎవ్వరి కీ తెలీదు. అయినా కూడా ఈ తెలుగుదేశం నేత చాలా దూరం వెళ్లిపోయాడు. లోకేష్ కు పుట్టబోయే పిల్లల నాయకత్వంలో కూడా పనిచేస్తామని ప్రకటించేసి.. కామెడీ చేశాడు.

మరి సోమిరెడ్డి ఇంతలా భజన చేస్తున్నదీ కేవలం ఎమ్మెల్సీపదవి కోసమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాగైనా పదవిని సంపాదించుకోవాలనే తాపత్రయంతో ఉన్న ఈయన ఇలా మాట్లాడి లోకేష్, చంద్రబాబుల దయ పొందడానికి ప్రయత్నించినట్టుగా ఉన్నాడు. మరి ఈయనకు ఆ పదవేదో లభిస్తుందా?!

మరింత సమాచారం తెలుసుకోండి: